మహిళల్లో పోషకాల అవసరాలు మగవారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వయసుని బట్టి మారిపోతుంటాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకల సాంద్రత తగ్గడం, హార్మోన్ల అసమతౌల్యత, జుట్టు రాలడం, చర్మంపైన ముడతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 30ల్లో మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. కొన్ని ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాలి.
ఎముక బలానికి: మహిళల్లో 30దాటాక ఎముకలు బలహీనపడతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలూ రావచ్చు. అందుకే కాల్షియం, విటమిన్ డి3, కె, మెగ్నీషియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాల్ని తినాలి. ఈ పోషకాలు పాలు, పాల ఉత్పత్తులు, రాగులు, నువ్వులు, ఆకుకూరలు, చిక్కుళ్లు వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముక సాంద్రతను పెంచి బలంగా చేస్తాయి.
రక్తహీనత రాకుండా: మహిళల్లో ఈ దశ చాలా కీలకం. పెళ్లి, ఉద్యోగం, కెరియర్ అంటూ ఆహారాన్ని దాటవేయడానికి ఎన్ని కారణాలో. ఫలితం రక్తహీనత. అందుకే పప్పు దినుసులు, పాలకూర, బీట్‌రూట్, బెల్లం వంటివి తినాలి. వీటితోపాటు విటమిన్ సి ఉండే ఉసిరి, ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లను తింటే మేలు.
మెరిసే చర్మం కోసం: మనం తీసుకునే ఆహారం చర్మ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. తగినంత ప్రొటీన్, విటమిన్లు శరీరానికి అందితేనే యవ్వనంగా కనిపిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లను తినాలి. ఇవి ఫ్రీరాడికల్స్‌ని తొలగించి చర్మానికి మెరుపునిస్తాయి. కండరాల వృద్ధికి, జుట్టు పెరుగుదలకి పనీర్, సోయా తప్పక తీసుకోవాలి.
హార్మోన్ల సమతుల్యత: మూడుపదుల వయసొచ్చాక హార్మోన్లలో హెచ్చుతగ్గులు, శారీరక, మానసిక అలసటను కలిగిస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ తగ్గడంతో డిప్రెషన్, అధిక బరువు వంటి సమస్యలు తోడవుతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే అవకాడో, నూనె గింజలు, నెయ్యి వంటివి తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్నీ, చక్కెర పదార్థాల్నీ మితంగా తింటే మేలు.
జీవ క్రియకు: పేగు ఆరోగ్యాన్ని కాపాడటానికి జీవక్రియను మెరుగు చేయడానికి ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉండే పెరుగు, పులియబెట్టిన ఊరగాయలు వంటివి తినాలి. అలాగే పీచు ఎక్కువ ఉండే ఓట్స్, ఉల్లి, వెల్లుల్లి, అరటిపండ్లకీ ప్రాధాన్యమివ్వాలి.
































