రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త గురువులతో సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సొంతం చేసుకున్న..
ప్రభుత్వ బడులు మళ్లీ కళకళలాడనున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారు. సుమారు 15,500 మంది కొత్త టీచర్లు నేటి నుంచి పాఠాలు చెప్పనున్నారు. విధుల్లో చేరేందుకు నెల రోజుల గడువు ఉన్నప్పటికీ చాలా మంది టీచర్లు సోమవారమే స్కూళ్లలో చేరనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త గురువులతో సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సొంతం చేసుకున్న 15,500 మంది ఉపాధ్యాయులు సోమవారంవారికి కేటాయించిన స్కూళ్లలో విధులకు హాజరుకానున్నారు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసింది. మెగా డీఎస్సీలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 13,192 పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, మోడల్ స్కూల్స్ సహా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న పలు మేనేజ్‌మెంట్లలో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం 13,089 మంది కొత్త టీచర్లకు పాఠశాల విద్యాశాఖ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది.
కొరత తీరింది!
చాలా కాలంగా పాఠశాల విద్యాశాఖను టీచర్ల కొరత వేధిస్తోంది. ప్రతి పాఠశాలలో ఏదో ఒక సబ్జెక్టులో ఉపాధ్యాయులు లేరనే మాట వినిపించేది. అందులోనూ వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగింది. ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారం చేపట్టగానే మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ప్రకటించి, 150 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు. 15,941 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో దాదాపుగా పాఠశాలల్లో టీచర్ల కొరత తీరింది. గతంలో ఎప్పుడు టీచర్ల బదిలీలు జరిగినా టీచర్ల కొరత కారణంగా ప్రతి పాఠశాలల్లో కొన్ని పోస్టులు బ్లాక్ చేసేవారు. కానీ, ఈ ఏడాది చేపట్టిన బదిలీల్లో బ్లాకింగ్ విధానం తొలగించారు. దీంతో ఇప్పటికే చాలా పాఠశాలల్లో వంద శాతం టీచర్లు ఉన్నారు. మిగిలిన పాఠశాలల్లో మెగా డీఎస్సీ టీచర్లతో ఖాళీలు భర్తీ చేశారు. మెగా డీఎస్సీలో భర్తీ కాని 406, ఇటీవల జరిగిన పదవీ విరమణలతో ఏర్పడిన ఖాళీలు మినహా అన్ని పోస్టుల భర్తీ పూర్తయింది.
తరగతికి ఒక టీచర్: ప్రస్తుత ప్రభుత్వ పాఠశాల విద్యలో పలు సంస్కరణలు తెచ్చింది. దీనిలో మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానం కీలకం. 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేశారు. ఇలా సుమారు 9,600 ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చెందాయి. వాటిలో ప్రతి తరగతికీ ఒక టీచర్‌ను కేటాయించారు. ఆ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడి పోస్టు కూడా ఇచ్చారు. దీంతో మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. కొన్ని దశాబ్దాల కిందట ఉన్నట్టుగా ప్రతి తరగతికీ ఒక టీచర్‌ను కేటాయించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.
































