ఒంట్లో యూరిక్‌ యాసిడ్‌ ఎందుకు పెరుగుతుందో తెలుసా? ఈ తప్పులు చేస్తే తిప్పలు తప్పవ్‌

పాదాలు, మోకాళ్ల, కాలి వేళ్లలో తరచుగా నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. అది పెరిగిన యూరిక్ యాసిడ్‌కు సంకేతం కావచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.


అసలు శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయి ఎందుకు పెరుగుతుంది? దానిని ఎలా నియంత్రించాలి అనే విషయాలను ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి చెబుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని డాక్టర్ సుభాష్ వివరిస్తున్నారు. ఇది అధిక ప్రోటీన్ ఆహారాలు, అధిక ఎర్ర మాంసం వినియోగం వల్ల కూడా పెరుగుతుంది. శరీరంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. అయితే మనం అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకున్నప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు మూత్రపిండాలు దానిని పూర్తిగా తొలగించకుండా నిరోధిస్తుంది. దీంతో అది రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ఆహారాలు

రెడ్ మీట్, మటన్, కిడ్నీ బీన్స్, పప్పులు, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, పాలకూరలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే చక్కెర పానీయాలు, ఆల్కహాల్, బీర్ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. అంటే శరీరం తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయదు. దీంతో శరీరం నుంచి యూరిక్ యాసిడ్ విసర్జించబడదు. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికైనా యూరిక్ యాసిడ్ పెరిగే ధోరణి ఉంటే ఇతర సభ్యులకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

యూరిక్ యాసిడ్ లక్షణాలు ఇవే

  • కీళ్ల నొప్పి లేదా వాపు
  • మొబిలిటీ సమస్యలు లేదా ఆర్థరైటిస్
  • మంట లేదా తరచుగా మూత్రవిసర్జన
  • అలసట, జ్వరం, వికారం, బలహీనత

యూరిక్ యాసిడ్‌ను ఎలా నియంత్రించాలి?

  • ఎర్ర మాంసం, కిడ్నీ బీన్స్, కాలీఫ్లవర్ తీసుకోవడం తగ్గించాలి.
  • ఆహారంలో పెరుగు, తృణధాన్యాలు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తీసుకోవాలి.
  • పాల ఉత్పత్తులు, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలు, నారింజ వంటి పండ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  • యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జించబడటానికి మీరు ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
  • కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, ఉసిరి జ్యూస్‌ కూడా తాగొచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.