రైతులు ఏడాదికి రెండు సార్లు వరి సాగు చేస్తారు. ఈ తరుణంలో ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు. సన్న గింజ రకాలతో పాటు మధ్యస్థ, దొడ్డు గింజ రకాలను సైతం పండిస్తుంటారు.
వరి పంట(Rice crop) సాగు చేయాలంటే నీరు తప్పనిసరి. వరి సాగు పూర్తిగా నీటితో కూడుకున్నదనే విషయం తెలిసిందే. అన్నదాతలు వరి పంటకు అనుకూలమైన భూములను నీటితో నింపి సాగు చేయడానికి అనుకూలంగా సిద్ధం చేస్తారు. ఇక, మొదటగా రైతులు(farmers) వరి విత్తనాలు సేకరించి, వాటిని మొలకెత్తే విధంగా ఒక గోన సంచిలో వేసి రోజు నీళ్లతో తడపడం చేస్తుంటారు.
ఈ తరుణంలో మొలకలు రాగానే, సిద్ధంగా ఉంచిన నారుమడిలో చల్లుతారు. ఆ మొలకలు వరి నారుగా ఎదుగుతాయి. ఆ తర్వాత పంట పొలాల్లో ఆ వరిని నాటుతారు. సాధారణంగా ఏ రకం వరి పంట అయిన ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్లో మళ్లీ దున్ని, పొలం నాట్లు వేస్తారు. ఇక, వరి నాట్లకు అయ్యే ఖర్చుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వచ్చే ఆదాయంతో పోలిస్తే పంట కోసం పెట్టే పెట్టుబడి ఎక్కువ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. వరి నాటిన నుంచి మొదలుకొని అన్ని ఖర్చులు పోను చిన్న సన్న కారు రైతులకు మిగిలేది తక్కువే. అప్పటికీ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతన్నలు లబోదిబోమంటున్నారు. అందుకే.. రైతన్నలు అధిక దిగుబడి తేవాలని నానా తంటాలు పడుతుంటారు.
కొత్త రకం వరి..
ఒక కొత్త రకం వరి వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు (China scientists) అభివృద్ధి చేశారు. దీనిని చైనా (China)కు చెందిన సాధారణ రకం ఒర్జ్యా సతివా రకం వరిని, ఆఫ్రికాకు చెందిన మరో రకం వరిని సంకరం చేసి ‘పీఆర్-23’ని అభివృద్ధి చేశారు. ఈ రకం వరిని ఒక్కసారి నాటితే ఆరు సార్లు కోతకు వస్తోందంట. దీనిని చైనాలోని ‘యున్నన్ అకాడమీ’ శాస్త్రవేత్తలు ‘పెరెన్నియల్ రైస్- Pr23’ అనే అభివృద్ధి చేశారు. ఈ వంగడాన్ని ఒక్కసారి నాటితే, మూడేళ్ల పాటు వరుసగా ఆరు సీజన్ల వరకు పంట దిగుబడిని పొందవచ్చు. ఎకరాకు సుమారుగా రెండు టన్నుల వరి పండుతుంది. అంతేకాదు కూలీల సమస్య ఉండదు. పంటకు అయ్యే ఖర్చులు కూడా తక్కువే. ఎందుకంటే ఒక్కసారే నాటు వేస్తారు. విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వరిని 17 దేశాలతో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
కొత్త రకం వరి వంగడం ప్రత్యేకతలు..
ఇది వ్యవసాయ(agriculture) రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు. చైనా పీఆర్23 వరి వంగడం(rice bending) ఒక్కసారే నాటి మూడేళ్లలో 6 పంటలను కోసే అవకాశం ఉండటంతో సాగు ఖర్చు 29 శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. చైనాలో ఇప్పటికే ఈ రకం వరి పంటను పండిస్తున్నారు. పంట 119 రోజుల్లోనే కోతకు వస్తుంది. తొలి కోతలో హెక్టారుకు 6.8-7,5 టన్నులు, తర్వాత కోతల్లో 5.4-6.3 టన్నుల దిగుబడి వస్తోంది. భారత్లో సగటు వరి దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులే. ఆసియా, ఆఫ్రీకాలోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో కూడా పీఆర్-23 వంగడం మెరుగైన దిగుబడినిస్తున్నట్లు సమాచారం.
భారత్లో వాతావరణ పరిస్థితులు అనుకూలమేనా!
ఏ రకం వ్యవసాయ పంటలైన సరే వాతావరణ పరిస్థితులతో ప్రభావితం అవుతుంటాయి. అలాగే.. చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పీఆర్ వరి సాగులో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశపు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పీఆర్ వరి వంగడాలను రూపొందించుకోవాలి. పంట కోసిన తర్వాత తిరిగి పంట చిగురించటం కోసం నీరు పెట్టాలి. కాబట్టి.. సాధారణంగా పండించే వరి పంటలకంటే ఎక్కువ నీరు అవసరం అవుతుంది. మొలకలు రాకముందే మోళ్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంతేకాదు మొలకల కన్నా కలుపు వేగంగా పెరుగుతుంది. కలుపు మందులు వాడక తప్పదు. అలాగే వేసవి అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో పంటను రక్షించుకోవడం అంత తేలిక కాదని చెబుతున్నారు.
































