ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 2 నుంచి 3 శాతం డీఏ పెంచిన 8 రాష్ట్రాలు

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వాలు భారీ బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు, పింఛన్‌దారులకు డీఏ, డీఆర్‌ పెంచిన విషయం తెలిసిందే.


కరువు భత్యం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాలు తమ ఉద్యోగులకు డీఏ ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం అక్టోబర్ ప్రారంభంలో పెంచిన విషయం తెలిసిందే. మూడు శాతం డీఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆయా రాష్ట్రాల ఉద్యోగులు కూడా తమకు డీఏ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన మూడు శాతం కాకుండా రెండు శాతం ఇచ్చేందుకు చాలా రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు మూడు శాతం కూడా ఇచ్చాయి. ఇప్పటివరకు మొత్తం ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించాయి.

దీపావళి పండుగ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బహుమతి లభించాయి. మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్, రాజస్థాన్ ప్రభుత్వాలు కరువు భత్యాన్ని పెంచాయి. బీహార్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు మూడు శాతం కరువు భత్యం ప్రకటించాయి. మిగతా రాష్ట్రాలు రెండు శాతం డీఏ పెంచాయి. దీంతో ఆయా ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా భారీ ప్రయోజనం లభించింది.

సాధారణంగా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఏడాదిలో రెండు డీఏలు ప్రకటించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అనుగుణంగా జనవరి, జూలైలో డీఏ ఇవ్వాల్సి ఉంది. జూలైలో ప్రకటించాల్సిన డీఏలు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యంగా ప్రకటించాయి. పెంచిన డీఏ ఆలస్యం కావడంతో మిగతా మూడు నెలలకు సంబంధించిన బకాయిలను ఏరియర్స్‌ రూపంలో చెల్లిస్తున్నాయి. అయితే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం డీఏపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.