దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీపావళి పండుగ సందర్భంగా సామాన్యుల కోసం రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది.
ఈ రెండు పథకాలు పూర్తిగా రిస్క్ లేనివి. స్టాక్ మార్కెట్‌తో లేదా బోనస్‌లతో ఎటువంటి సంబంధం లేకుండా అందుబాటులోకి వచ్చాయి. ఎల్ఐసీ అక్టోబర్ 14న చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ రెండు కొత్త పథకాలు అక్టోబర్ 15 నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ పథకాలు వేర్వేరు వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా ఉన్నాయి.
ఎల్ఐసీ జన్ సురక్ష
ఈ పథకం ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ బీమా పథకం. అంటే దీని రాబడి స్టాక్ మార్కెట్‌తో లేదా కంపెనీ బోనస్‌లతో ముడిపడి ఉండదు. దీన్ని ఒక సూక్ష్మ బీమా పథకంగా ప్రారంభించారు. ఆర్థికంగా బలహీన వర్గాలు కూడా సులభంగా బీమా రక్షణ పొందేలా తక్కువ ప్రీమియంలకు, అనుకూలమైన చెల్లింపు ఎంపికలతో ఇది అందుబాటులో ఉంటుంది.
ఎల్ఐసీ బీమా లక్ష్మి
బీమా లక్ష్మి అనేది LIC ప్రారంభించిన మరో కొత్త జీవిత బీమా, పొదుపు పథకం. ఈ ప్లాన్ కూడా మార్కెట్ రిస్క్ లేకుండానే జీవిత బీమా రక్షణతో పాటు, మెచ్యూరిటీ సమయంలో మంచి మొత్తంలో పొదుపు డబ్బును అందిస్తుంది.
కొత్త పథకాల ప్రకటనతో ఎల్ఐసీ షేర్ల జోరు..
రెండు కొత్త పథకాల ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్‌లోని బలహీనమైన ట్రెండ్‌ను ధిక్కరిస్తూ LIC షేర్లు పెరిగాయి. LIC షేర్ ధర రూ.904.15 గరిష్ట స్థాయికి చేరుకుంది. మొత్తం ఏడాది పనితీరులో ఎల్‌ఐసీ షేర్ ధర కాస్త నిరాశపరిచినప్పటికీ గత ఆరు నెలల్లో స్టాక్ ఏకంగా 17శాతం పెరుగుదలను నమోదు చేసింది. సామాన్య ప్రజలకు భద్రత, పొదుపును అందించే ఈ రెండు కొత్త పథకాలతో LIC తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.



































