హైదరాబాద్ లో టూరిస్టు ప్రదేశాలను చూసి చూసి బోర్ కొట్టిందా..? అయితే మీకోసం ఇండియన్ రైల్వేస్ బెస్ట్ టూరిస్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తమిళనాడులోని ఊటీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. IRCTC ఊటీ టూర్ ప్యాకేజ్ లో భాగంగా 6 రోజుల పాటు ఊటీ, కూనూర్, కోయంబత్తూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. శీతాకాలం వస్తుండటంతో ఈ ప్రత్యేక టూర్ ను అందుబాటులోకి తెచ్చింది ఇండియన్ రైల్వేస్. ఈ ప్రాంతం గురించి ఎంత వర్ణించినా తక్కువే. భూతల స్వర్గంలా ఈ ప్రాంతం చూపరులను మైమరిపిస్తుంది. ఇక్కడి పచ్చని కొండలు, ఒంపులుగా సాగే రహదారులు, టీ తోటలు, పార్కులు, అడవులు చక్కటి అనుభూతిని ఇస్తాయి.
IRCTC ఊటీ టూర్ ప్యాకేజ్ ద్వారా 6 రోజుల పాటు ఊటీ, కూనూర్, కోయంబత్తూర్ ప్రాంతాలను చూడవచ్చు. ఈ ప్యాకేజ్ ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రయాణం రైలులో మొదలవుతుంది. అక్కడి నుంచి కారు ద్వారా ఊటీ, కూనూర్ ప్రాంతాల్లో తిరగవచ్చు. మొత్తం 6 రోజులు, 5 రాత్రుల టూర్ ఇది. ఈ యాత్రలో భాగంగా ఊటీ సరస్సు, పైన్ ఫారెస్ట్, ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, జింకల పార్కు, అవలాంచే సరస్సు, దోడబెట్ట ప్రాంతం.. తదితర ప్రదేశాలను కవర్ చేయవచ్చు.
ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న ఈ యాత్రలో భాగంగా తొలిరోజు శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. ఈ రైలు మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. రెండో రోజు ఉదయం 9:10 కు కోయంబత్తూర్ చేరుకుంటుంది. అక్కడినుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ప్రయాణికుల్ని బస్సులో తీసుకెళ్తారు. ఊటీలోని హోటల్ లో బస ఏర్పాటు చేస్తారు. మొదటి రోజు బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు సందర్శించవచ్చు.
రెండో రోజు దోడబెట్ట, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ తదితర టూరిస్ట్ సైట్స్ ను సందర్శిస్తారు. మూడోరోజు కూనూర్ సందర్శన ఉంటుంది. మరుసటి రోజు ఊటీ నుంచి కోయంబత్తూర్ చేరుకుని.. అక్కడినుంచి శబరి ఎక్స్ ప్రెస్ ద్వారా హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది. ఈ టూర్ ధర రూ. 13 వేల నుంచి ప్రారంభం అవుతుంది. పూర్తి వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.



































