భక్తులకు టీటీడీ గమనిక- ఆ రోజున తిరుమలలో సేవలు రద్దు

 ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 78,569 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,482 మంది తలనీలాలు సమర్పించారు.


తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 23 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.

ప్రస్తుతం దీపావళి ఆస్థానం కోసం తిరుమల ముస్తాబు అవుతోంది. ఈ నెల 20వ తేదీన దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనుంది టీటీడీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థాన కార్యక్రమం ఏర్పాటవుతుంది.

అదే సమయంలో మరో విశేేష ఉత్సవాన్ని కూడా నిర్వహించబోతోంది టీటీడీ. ఈ నెల 30వ తేదీన గురువారం శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. దీనికి అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, ఇతర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు

అంకురార్పణ కారణంగా 29న సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.