తాటి చెట్టు నుంచి కుండలోకి వచ్చే ద్రావణాన్ని “కల్లు” అని అంటారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ పానీయం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, సరైన సమయంలో తాగకపోతే లేదా రసాయనాలు కలిపితే, ఇది విషపూరితంగా మారి శరీరానికి హానికరమవుతుంది.
12 గంటల్లో తాగాలి – ఆ తర్వాత విషం!
తాటి చెట్టు నుంచి సేకరించిన కల్లు 12 గంటల లోపే తాగాలి. ఆ తర్వాత ఇది పులవడం ప్రారంభమవుతుంది, దాంతో ఆల్కహాల్ శాతం పెరిగి మత్తు ఇచ్చే ద్రవంగా మారుతుంది. పులిసిన కల్లు శరీరానికి మంచిది కాదు. 100 మిల్లీలీటర్ల కల్లులో సుమారు 75 క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు ప్రధానంగా సుక్రోజ్ రూపంలో ఉండటంతో, డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది సురక్షితంగా పరిగణించబడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని వైద్య నిపుణులు అంటున్నారు.
మత్తు లేకుండా తాగాలంటే…
తాజా నీరా (కల్లు) ను సేకరించిన వెంటనే తాగితే, దానిలో మత్తు ఉండదు. సమయం గడిచేకొద్దీ ఫెర్మెంటేషన్ కారణంగా ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. అందువల్ల ఉదయాన్నే తీసుకోవడం ఉత్తమం.కొంతమంది కల్లు పులవకుండా ఉండటానికి క్యాల్షియం హైడ్రాక్సైడ్ వంటి రసాయనాలు కలుపుతారు. దీని వల్ల ఆల్కహాల్ శాతం మరింత పెరుగుతుంది. ఇలాంటి రసాయనాలు కలిపిన కల్లు శరీరానికి హానికరంగా మారి, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
































