ఈ నెల దేశవ్యాప్తంగా పండుగల నెల. అక్టోబర్ నెల దసరా, దీపావళి, ఛత్ వంటి ప్రధాన పండుగలకు నాంది పలుకుతుంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి, ఛత్ జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దీపావళి జరుపుకుంటారు, బీహార్‌లో ఛత్ జరుపుకుంటారు. తేదీల వారీగా సెలవు సమాచారం గురించి తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో..
ఈ దీపావళికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం ఒకేరోజు అధికారిక సెలవుంది. కానీ ఓ ఆదివారం కలిసిరావడంతో రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మరో సెలవు కలిసివచ్చే అవకాశాలున్నాయి. దీంతో దీపావళి హాలిడేస్ మూడ్రోజులకు పెరిగేలా ఉంది. శనివారం నాడు చాలా పాఠశాలలు మూసి ఉండే అవకాశం ఉంది. అంతేకాదండోయ్ శనివారం తెలంగాణలో బిసి సంఘాలు తమ రిజర్వేషన్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో అక్టోబర్ 21న అదనపు సెలవు ఉండవచ్చని సమాచారం వస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దీనిని కూడా ప్రభుత్వం సెలవుగా ప్రకటిస్తే మొత్తం నాలుగు రోజులు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, దీపావళి సీజన్ విద్యార్థులకు అదనపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
రాజస్థాన్‌లో సెలవులు:
రాజస్థాన్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సీతారాం జాట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలో దీపావళి సెలవులను పొడిగించారు. మొదట అక్టోబర్ 16 నుండి 27 వరకు సెలవులు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ఈ సెలవులు ఇప్పుడు అక్టోబర్ 13 నుండి అమలులోకి వచ్చాయి. అయితే, మొత్తం సెలవు కాలం ఆదివారం (అక్టోబర్ 12) తో సహా 12 రోజులు ఉంటుంది. ఈ కాలంలో జైపూర్, జోధ్‌పూర్, బికనీర్, ఉదయపూర్, అజ్మీర్, కోటా డివిజన్లలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసి ఉంటాయి. రాజస్థాన్‌లోని పాఠశాలలు ఇప్పుడు అక్టోబర్ 25న తిరిగి తెరుచుకుంటాయి.
ఉత్తరప్రదేశ్‌లో 4 రోజుల సెలవులు:
ఉత్తరప్రదేశ్‌లో దీపావళి కారణంగా అక్టోబర్ 20 నుండి 23 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో దీనికి మరో రోజు జోడించింది ప్రభుత్వం. ఈ సెలవు ఉత్తర్వు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది.
బీహార్‌లో సుదీర్ఘ సెలవులు ఉంటాయి:
దీపావళి, ఛత్ పండుగల కారణంగా బీహార్‌లోని పాఠశాలలు 2025 అక్టోబర్ 20 నుండి 29 వరకు మూసి ఉంటాయి. అంటే రాష్ట్రం మొత్తం 10 రోజుల సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయి.
హర్యానాలో 5 రోజులు సెలవులు:
దీపావళి పండుగ కారణంగా హర్యానాలోని పాఠశాలలు అక్టోబర్ 19 నుండి 23, 2025 వరకు ఉంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తం ఐదు రోజులు సెలవులు లభిస్తాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఇతర హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా సెలవులు ప్రకటించారు. ఈ తేదీల గురించి వారి సంబంధిత పాఠశాలల నుండి సమాచారాన్ని పొందవచ్చు. సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చని దయచేసి గమనించండి.
































