ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో 15 బిలియన్ భారీ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిన్న ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీంతో రాబోయే రోజుల్లో విశాఖలో డేటా సెంటర్ జాబ్స్ లభించే అవకాశాలతో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరకబోతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు డేటా సెంటర్ లో సాధారణంగా ఉండే ఉద్యోగాలు ఏంటి ?, వాటికి ఏయే కోర్సులు చదివి ఉండాలి, ప్రస్తుతం ఏయే సర్టిఫికేషన్స్, అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలు లభిస్తాయో చూద్దాం..
డేటా సెంటర్లతో ఉద్యోగాలు
వాస్తవానికి డేటా సెంటర్లు టెక్నికల్ ఉద్యోగాల నుంచి మేనేజ్ మెంట్, సపోర్టింగ్ రూల్స్ వరకు చాలా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి. నిర్దిష్ట ఉద్యోగాన్ని బట్టి అవసరమైన అర్హతలు మారుతూ ఉంటాయి. కానీ చాలా ఉద్యోగాలకు విద్యా నేపథ్యం, సర్టిఫికెట్లు, ఐటీ అర్హతలు, సదరు కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఇవి ఉంటే కచ్చితంగా డేటా సెంటర్ లో ఉద్యోగం దొరికినట్లే. ఇంతకీ అసలు డేటా సెంటర్లలో లభించే ఉద్యోగాలేంటో ఓసారి చూద్దాం..
డేటా సెంటర్లలో లభించే ఉద్యోగాలు
1.డేటా సెంటర్ టెక్నీషియన్: హార్డ్‌వేర్, నెట్‌వర్క్ పరికరాలు , సర్వర్‌లను ఇన్‌స్టాల్ చేయడం, నిర్వహించడం, ట్రబుల్ షూటింగ్ చేయడం వీరి బాధ్యత.
2. నెట్‌వర్క్ ఇంజనీర్: డేటా సెంటర్ యొక్క నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌ను డిజైన్ చేయడం, నిర్వహించడం వీరి బాధ్యత.
3. ఫెసిలిటీస్ ఇంజనీర్/టెక్నీషియన్: మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం, విద్యుత్, శీతలీకరణ, భద్రతా వ్యవస్థల పనితీరు చూసుకోవడం.
4. ఐటీ సపోర్ట్ స్టాఫ్ : సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ , భద్రతా సమస్యల్ని పరిష్కరించడం.
5. ప్రాజెక్ట్ మేనేజర్/ప్రోగ్రామ్ మేనేజర్: డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లు, అప్‌గ్రేడ్‌లు లేదా విస్తరణలను సమన్వయం చేయటం.
6. ఎసెట్ మేనేజర్/ఇన్వెంటరీ టెక్నీషియన్: పరికరాల సేకరణ, ట్రాకింగ్ , డాక్యుమెంటేషన్‌ను నిర్వహించడం.
7. సెక్యూరిటీ ఎనలిస్ట్ : స్టోర్ చేసిన డేటా , మౌలిక సదుపాయాల భద్రతను చూసుకోవడం.
డేటా సెంటర్ ఉద్యోగాల అర్హతలు
విద్యార్హత: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగంలో కనీసం డిప్లొమా లేదా డిగ్రీ అవసరం.
సర్టిఫికేషన్లు: CompTIA A+, Cisco సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (CCNA), Microsoft సర్టిఫైడ్: Azure అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ , సర్టిఫైడ్ డేటా సెంటర్ ప్రొఫెషనల్ (CDCP) వంటి ఇండస్ట్రీ-గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు చాలా అవసరం.
సాంకేతిక నైపుణ్యాలు: సర్వర్ మరియు నెట్‌వర్కింగ్ సెటప్‌లలో నైపుణ్యం, ట్రబుల్ షూటింగ్, వర్చువలైజేషన్ (క్లౌడ్ టెక్నాలజీస్), పైథాన్/పవర్‌షెల్ స్క్రిప్టింగ్ మరియు హార్డ్‌వేర్ నిర్వహణ పరిజ్ఞానం అవసరం.
అనుభవం: ఎంట్రీ-లెవల్ పాత్రలకు ప్రాథమిక జ్ఞానం మరియు నేర్చుకోవాలనే సుముఖత మాత్రమే అవసరం అయినప్పటికీ, చాలా స్థానాలు ఐటీ లేదా కార్యకలాపాలలో 1-2 సంవత్సరాల సంబంధిత అనుభవాన్ని అడుగుతాయి. ముఖ్యంగా డేటా సెంటర్ నిర్వహణ , అధునాతన సాంకేతిక పాత్రలకు ఇది తప్పనిసరి.
ఇంటర్ పర్సనల్ స్కిల్స్: డేటా సెంటర్ సిబ్బంది బృందాలలో పని చేస్తారు, సమస్యలకు త్వరగా స్పందించాలి కాబట్టి, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ , సమస్య పరిష్కార సామర్థ్యాలు దాదాపు అన్ని ఉద్యోగాలకు కీలకమైనవి.
డిమాండ్ ఉన్న నైపుణ్యాలు 2025
సర్వర్, నెట్‌వర్క్ మరియు స్టోరేజ్ నిర్వహణ, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ అనుభవం (AWS, Azure, GCP), డేటా సెంటర్ ఆటోమేషన్ మరియు AI నిర్వహణ, సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు మరియు రిస్క్ నిర్వహణ, MEP (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్), పవర్ డెలివరీ మరియు హైపర్‌స్కేల్ మౌలిక సదుపాయాల పరిజ్ఞానం ఉండాలి. డేటా సెంటర్ ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులు సాంకేతిక పరిజ్ఞానం, ఆచరణాత్మక ధృవపత్రాలు మరియు ఐటీ లేదా ఆపరేషన్స్ లో అనుభవాన్ని, బలమైన సమస్య పరిష్కారం , కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలి.




































