దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోని ఐదు వాతావరణ సబ్ డివిజన్లపై ప్రభావం చూపే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం బులెటిన్‌ను విడుదల చేసింది. నైరుతి సీజన్‌లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. నాలుగు నెలల సీజన్‌లో 869.6 మిల్లీమీటర్లకుగాను 937.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1నుంచి సెప్టెంబరు 30 వరకు నైరుతి సీజన్‌గా పరిగణిస్తున్నా, అక్టోబరు 15న రుతుపవనాలు పూర్తిగా వైదొలగాల్సి ఉంది. అయితే, ఒకరోజు ఆలస్యంగా గురువారం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలిగాయి. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళల్లో గురువారం ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. గడచిన 24గంటల్లో తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవడం, బంగాళాఖాతం మీదుగా తూర్పు/ఈశాన్య గాలులు భూ ఉపరితలంపైకి వీయడంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ నిర్ధారించింది. అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకు ఈశాన్య సీజన్‌గా పరిగణిస్తారు. ఈ సీజన్‌లో బంగాళాఖాతం మీదుగా వచ్చే తూర్పు/ఈశాన్య గాలులు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. బంగాళాఖాతంలో తుఫానులు సంభవిస్తాయి. వీటి ప్రభావంతో దక్షిణాదిలో వర్షాలు కురుస్తాయి. ఇదిలావుండగా కామరూన్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, సముద్రం నుంచి వీచే తూర్పుగాలుల ప్రభావంతో గురువారం దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇక ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వచ్చే సోమవారానికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ పేర్కొంది. ఇంకా ఈనెల 24వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడనుందని తెలిపింది.
నెల్లూరులో రోడ్లన్నీ జలమయం..
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షాలు కురిశాయి. వేకువజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో రోడ్డన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి ప్రజలు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. అత్యధికంగా అల్లూరులో 56.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
































