హైదరాబాద్‌ టు శ్రీశైలం నాన్‌ స్టాప్‌

147 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం


రావిర్యాల నుంచి ఆమన్‌గల్‌ రోడ్డు దీనితో అనుసంధానం

ఫ్యూచర్‌ సిటీలో భాగంగా 42 కి.మీ. రోడ్డు నిర్మించనున్న ప్రభుత్వం

ఆమన్‌గల్‌ నుంచి మన్ననూరు వరకు 51 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వే

మన్ననూరు నుంచి శ్రీశైలానికి 54 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌

కేంద్రం అనుమతి కోసం త్వరలోనే డీపీఆర్‌ సమర్పణ

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాన్‌ స్టాప్‌ ప్రయాణం వీలుకానుంది. 147 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్, ఆమన్‌గల్‌ నుంచి మన్ననూరు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించి అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

ఫ్యూచర్‌ సిటీలో భాగంగా ఇప్పటికే హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న రావిర్యాల (ఓఆర్‌ఆర్‌) నుంచి ఆమన్‌గల్‌ వరకు కొత్త రహదారిని ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారితో అనుసంధానించనున్నారు. ఆమన్‌గల్‌ నుంచి మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే… మన్ననూరు నుంచి శ్రీశైలం 54 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం జరగనుంది.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు రూ. 7,500 కోట్ల వ్యయ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం తెలి సిందే. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సమర్పించనుంది.

నిర్మాణ భారాన్ని తగ్గించుకోవడానికి..
తుక్కుగూడ నుంచి దిండి వరకు 85.8 కి.మీ. మేర నాలుగు వరుసలుగా రహదారి విస్తరణ.. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 54 కి.మీ. వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈ మేరకు దిండి నుంచి మన్ననూరు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఏఐకు బదిలీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అయితే భూసేకరణ, ప్రస్తుతం రహదారి వెంబడి యుటిలిటీ షిఫ్టింగ్‌కు భారీ వ్యయం అవుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఫ్యూచర్‌ సిటీలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల (ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌) నుంచి ఆమన్‌గల్‌ వరకు 41.5 కి.మీ. వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీలు, యుటిలిటీల వంటి అన్ని రకాల అవసరాల కోసం 100 మీటర్ల వరకు భూములను సమీకరిస్తోంది.

రావిర్యాల నుంచి ఆమన్‌గల్‌ వరకు నిర్మించనున్న రోడ్డు ముగింపు తర్వాత అక్కడి నుంచే ఆమన్‌గల్‌-మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ రహదారి అలైన్‌మెంట్‌కు కల్వకుర్తి బైపాస్‌లోని ప్రస్తుత ఎన్‌హెచ్‌-765, ఎన్‌హెచ్‌-167లను అనుసంధానించనుంది. ఈ కొత్త రహదారి పొడవు 11 కి.మీ. ఉంటుంది. దీని డీపీఆర్‌ను ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ (ఏఏసీ) ఆమోదం కోసం పంపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.