మీ కరెంట్ మీ ఇష్టం…కేంద్రం కొత్త విద్యుత్ బిల్లు ఇదే

మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, దానికి ఏ సంస్థ నెట్ వర్క్ ని అనుసంధానం చేసుకోవడం అన్నది కస్టమర్ల చేతులలోనే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ నా లేక ఎయిర్ టెల్ నా లేక జీయో ఇంకా వేరే నెట్ వర్క్ నా అన్నది ఎవరి అభీష్టం బట్టి వారు ఎంచుకుంటారు.


ఇక త్వరలో విద్యుత్ కూడా ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసి ఇంటికి వాడుకోవాలో ఆ ఇష్టాన్ని ఆ స్వేచ్చను వినియోగదారుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ప్రస్తుతం ఆ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు పూర్వ రంగం అంతా సిద్ధం చేస్తున్నారు.

కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లుతో :

దేశంలో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగానే చూస్తున్నారు. ఇప్పటిదాకా విద్యుత్ అన్నది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వమే విద్యుత్ ని కొని వినియోగదారులకు నేరుగా అందిస్తోంది. ఆ ఎక్కువ తక్కువలలో వచ్చే నష్టాలను కూడా మెల్లగా భారాలుగా వేస్తూ వస్తోంది. దీని వల్ల కొన్ని సార్లు ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది.అంతే కాదు టారీఫ్ పెంచితే ప్రజలు ఊరుకోరు. అదే విధంగా వేసవి లాంటి సీజన్లలో తగినంత విద్యుత్ సరఫరా చేసి అందివ్వకపోతే ప్రభుత్వాలు అభాసుపాలు అవుతాయి. జనాల ఆగ్రహానికి గురి అవుతాయి. ఇవి రాజకీయ పార్టీల జాతకాన్ని కూడా మారుస్తూ విద్యుత్ షాకులు కొట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పక తప్పదు.

ప్రైవేటీకరణ దిశగా :

ఒక విధంగా చెప్పాలీ అంటే కేంద్రం తీసుకుని రాబోతున్న కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లుతో ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ కాస్తా ప్రైవేట్ పరం అవుతుంది. చాలా బడా కార్పోరేట్ సంస్థలు రంగంలోకి దిగుతాయి. అవే నేరుగా ప్రజలకు విద్యుత్ ని అమ్ముతాయి. దానిని మొబైల్ రీచార్జి చేసుకున్నట్లుగా వినియోగదారులు చేసుకోవాల్సి వస్తుంది. ఇక సంస్థ యూనిట్ కి ఆరు రూపాయలు తీసుకుంటే మరో సంస్థ అయిదు రూపాయలు ఇస్తమంటే అలా ఎవరికి వారుగా వినియోగదారులు మారేందుకు ఈ బిల్లులో స్వేచ్చ ఉంటుంది. స్థూలంగా చెప్పాలీ అంటే సగానికి సగం విద్యుత్ రంగం అంతా ప్రైవేట్ పరం అవుతుంది అన్న మాట. ఫోన్ సిం కార్డు వాడినట్లుగా విద్యుత్ కార్డుని వాడుతారు అన్న మాట.

వారంతా ఫీల్డ్ లోకి :

విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే కనుక ఆదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా పవర్, టోరెంట్ పవర్, సీఈఎసీ వంటి బడా ప్రైవేట్ సంస్థలు రంగంలోకి దిగిపోతాయి. ఇవన్నీ కూడా తమ విద్యుత్ ని ప్రైవేట్ గా ప్రజలకు నేరుగా అమ్మకం చేయవచ్చు అన్న మాట. వారే డైరెక్ట్ గా వినియోగదారులకు కనెక్షన్లు ఇస్తాయన్న మాట. కేంద్రం కూడా కొత్త బిల్లులో ఏకంగా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ అతి పెద్ద విద్యుత్ రంగాన్ని రీటైల్ విద్యుత్ మార్కెట్ గా మార్చబోతోంది అని అంటున్నారు.

ముసాయిదా బిల్లు తో :

ఇక వారం క్రితమే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లు మీద తయారు చేసిన ముసాయిదా బిల్లుని పంపించింది. దీని మీద రాష్ట్రాలు ఆమోదం తెలిపితే చాలు కేంద్రం పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టంగా మారుస్తుంది. దేశంలో అనేక రాష్ట్రాలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి, అంతే కాదు ఎన్డీయే మిత్రుల ఆధీనంలో ఉన్నాయి. దాంతో మెజారిటీ రాష్ట్రాలు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుకి ఓకే చెబుతారు అని అంటున్నారు. అంటే సాధ్యమైనంత తొందరలోనే ఈ బిల్లు ఆమోదం పొంది ప్రైవేట్ విద్యుత్ రంగానికి బాటలు తెరచుకుంటాయని అంటున్నారు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.