విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రతిపాదనను విరమించారు. విద్యుత్ యాజమాన్యం, ఉద్యోగసంఘాల నేతల మధ్య ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘంగా సాగిన చర్చలు సఫలమయ్యాయి. గత మంగళవారం యాజమాన్యం, ఐకాస మధ్య అసంపూర్తిగా నిలిచిన చర్చలు.. శుక్రవారం మధ్యాహ్నం 3.15కు తిరిగి ప్రారంభమయ్యాయి. సీఎస్ విజయానంద్, ఉద్యోగసంఘాల మధ్య పలుదఫాలు చర్చలు జరిగాయి. ఈలోగా సీఎం నుంచి పిలుపు రావడంతో సీఎస్ విజయానంద్ వెళ్తూ.. యాజమాన్యం తరఫున అంగీకరించే డిమాండ్లపై కొంత స్పష్టత ఇచ్చారు. తర్వాత ఉద్యోగుల ఐకాసతో చర్చలు కొనసాగించాలని జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, జేఎండీ ప్రవీణ్‌చంద్‌కు సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే డిమాండ్‌ను అంగీకరించేందుకు యాజమాన్యం ససేమిరా అనడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగింది. అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చలు కొనసాగాయి. పలు దఫాలు ఉద్యోగసంఘాల నేతలు చర్చల నుంచి బయటకు వచ్చి.. ఎలా ముందుకువెళ్లాలనే దానిపై తమలో తాము మాట్లాడుకున్నారు.
మినిట్స్‌లోనూ పలు మార్పులు: విద్యుత్ యాజమాన్యం తయారుచేసిన మినిట్స్‌పైనా ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చల సమయంలో సీఎస్ ఇచ్చిన హామీలు.. మినిట్స్ మరోలా తయారుచేశారంటూ ఉద్యోగుల ఐకాస అభ్యంతరం తెలిపింది. దీంతో అనేకసార్లు మినిట్స్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రతిపాదనపై యాజమాన్యం నిర్ణయాన్నీ మినిట్స్‌లో చేర్చాలని పట్టుపట్టారు. చర్చల్లో అంగీకరించని అంశాన్ని మినిట్స్‌లో చేర్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదు. దీనికితోడు మరికొన్ని డిమాండ్లలోనూ కొద్దిగా మార్పులు చేసిన తర్వాత సమ్మె విరమణకు అంగీకరిస్తూ విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
యాజమాన్యం అంగీకరించిన ప్రధాన డిమాండ్లు: కాంట్రాక్టు ఉద్యోగులకు వైద్యసేవలు అందించాలన్న డిమాండ్‌ను యాజమాన్యం అంగీకరించింది. దీంతోపాటు వారికి బీమా సదుపాయం, పదవీవిరమణ సమయంలో కొంత ఆర్థిక ప్రయోజనాలు. – ప్రమాదానికి గురైనప్పుడు సెలవు ఇచ్చేందుకు అంగీకారం. – పదేళ్లపాటు సేవలందించిన సిబ్బందికి కేడర్ ఆధారంగా వెయిటేజ్ ప్రయోజనాలు. – 2022 పీఆర్సీ ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు సిబ్బందికి పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకారం. – కిందిస్థాయిలో ఉన్న ఖాళీలను డిప్లమో హోల్డర్లతో భర్తీ. – గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు జేఎల్‌ఎం గ్రేడ్-2గా పదోన్నతులు కల్పించేందుకు అంగీకారం. – వాటితోపాటు ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్న 29 డిమాండ్లలో.. మెజారిటీ డిమాండ్లను యాజమాన్యం అంగీకరించింది. – కారుణ్య నియామకాల వయోపరిమితిలో ఒకసారి మాత్రమే సడలింపు.
అంగీకరించని ప్రధాన డిమాండ్లు: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించడం – కాంట్రాక్టు ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా కాకుండా.. సంస్థ నుంచి నేరుగా జీతాల చెల్లింపు. – 1999-2004 మధ్య విద్యుత్ సంస్థలో నియమించిన సిబ్బందిని జీపీఎఫ్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌పై కమిటీ ఏర్పాటుచేసి.. కమిటీ సూచనల ఆధారంగా నిర్ణయం.
































