తీపికబురు .. త్వరలోనే ఏపీలో వారికి ప్రత్యేక పెన్షన్ లు

సాంస్కృతిక, కళారంగానికి, పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు సాంస్కృతిక కళారంగానికి పట్టం కడుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


విజయవాడ ఉత్సవ్, విజయనగరం ఉత్సవ్ తో పాటు వివిధ ఉత్సవాలను నిర్వహిస్తూ, కళలను ప్రోత్సహిస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కళాకారులకు శుభవార్త చెప్పారు.

కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్

విజయనగరం జిల్లా రాజాంలో జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రంను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ కళాకారుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి మార్గదర్శకమైన కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు

కళలను కళాకారులను ప్రోత్సహించడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నాటక సమాజాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచన చేశారు. సంబంధిత డేటా బ్యాంక్ తో కళాకారులకు ప్రభుత్వం తరపున అవసరమైన సౌకర్యాలు అందించేందుకు వీలు కలుగుతుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

కళారంగం అభివృద్ధికి కార్యాచరణ

కళారంగం అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుతో,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కళలకు జీవం పోసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కళల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కళలకు ప్రాధాన్యతనివ్వలేదన్నారు.

వైసీపీ హయాంలో కళారంగాన్ని పట్టించుకోలేదు

వైసీపీ హయాంలో కళారంగాన్ని పట్టించుకోలేదని విమర్శలు చేసిన మంత్రి కందుల దుర్గేష్ కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి , కళలకు సాంస్కృతిక పునరుజ్జీవనానికి పెద్దపీట వేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేకంగా ఇచ్చే పెన్షన్లు అందరితో పాటు ఇచ్చే పెన్షన్లలో కలిపారని ఓ కళాకారుడు ఆవేదనను మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు.

కళాకారుల ఆత్మ గౌరవం కాపాడేలా ప్రత్యేక పెన్షన్

కళాకారులకు డబ్బు ముఖ్యం కాదని కానీ కళాకారులు అన్నపేరుతోనే పెన్షన్ ఇస్తే తమకు ఆత్మగౌరవం అని కళాకారులు ఫీలవుతారని ఇక ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్ది అతిత్వరలోనే కళాకారుల పేరుతోనే గౌరవ వేతనంగా అందించేందుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.