Diabetes: మధుమేహానికి నిద్రతో చెక్‌.. ఎలాగంటే?

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తున్నా కొందరిలో మధుమేహం (Diabetes) అదుపులోకి రాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా షుగర్‌తో బాధపడుతూనే ఉంటారు. అయితే దీనికి నిద్రలేమి కూడా ఓ ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. కొంతకాలం పాటు HbA1c స్థాయుల్లో (రెండు, మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయి) ఎటువంటి తగ్గుదల లేని కొందరు మధుమేహ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. ఏడు గంటల కచ్చిత నిద్రతో షుగర్‌ను అదుపు చేయొచ్చని చెబుతున్నారు.


మధుమేహ నిర్వహణకు నిద్ర ఎందుకు కీలకం?

నిద్రలేమి వల్ల గ్లూకోజ్ జీవక్రియలు, ఇన్సులిన్, హార్మోన్ నియంత్రణ వంటివి దెబ్బతింటాయని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఇవి ఆకలితో పాటు.. రక్తంలో చక్కెర స్థాయులను కూడా పెంచుతాయి. సరైన నిద్ర వల్ల కార్టిసాల్ పెరుగుదలలో నియంత్రణ వస్తుంది. లెప్టిన్, గ్రెలిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లను స్థిరీకరిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం తనకు కావాల్సిన శక్తిని పునరుద్ధరించుకోగలుగుతుంది. గ్లూకోజ్‌ను నియంత్రించడానికి, కణజాలాలను మరమ్మతు చేయడానికి, జీవక్రియ సమతుల్యతను కాపాడుకోవడానికి కావాల్సిన సమయాన్ని కేటాయించుకోగలుగుతుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, కణాలు గ్లూకోజ్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయి.

ఎన్ని రోజుల్లో HbA1c స్థాయులు తగ్గుతాయి?

HbA1c స్థాయుల్లో మెరుగుదల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎంతకాలం జీవిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దీనికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. పాత ఎర్ర రక్త కణాలు (ఎక్కువ చక్కెర స్థాయులో ఉన్నవి).. కొత్త, ఆరోగ్యకరమైన కణాలతో భర్తీ అయినప్పుడు రక్తంలో HbA1c స్థాయుల్లో క్రమంగా రెండు నుంచి మూడు నెలల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి అలవాట్లతో HbA1cలో స్థాయుల్లో స్థిరమైన మెరుగుదలను చూడవచ్చు. కేవలం రెండు నెలల పాటు ప్రతిరోజు ఏడు గంటలు నిద్రపోయిన వ్యక్తులు తమ HbA1c స్థాయుల తగ్గుదలను ఎలా గమనించారనే విషయాన్ని ఈ అధ్యయనం వెల్లడించింది. తగిన నిద్ర వల్ల హార్మోన్ల సమతుల్యత, ఇన్సులిన్ సామర్థ్యం వంటివి మెరుగవడమే దీనికి కారణమని తెలిపింది.

ఎలా పాటించాలి?

క్రమంతప్పకుండా ఒకే సమయానికి నిద్ర పోవడం, మేల్కొనడం, పడుకొనే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ప్రశాంతంగా నిద్ర పోయేందుకు  బెడ్‌రూమ్‌ను చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం, నిద్రకు ముందు తక్కువ ఆహారం తీసుకోవడం, నిరాడంబరమైన జీవనశైలి దీనికి ఉపకరిస్తాయని అధ్యయనం పేర్కొంది. శరీరానికి తగిన విశ్రాంతి లభించినప్పుడు ఇతర పనులు చేసుకోవడానికీ, వ్యక్తిగత, వృత్తి సంబంధ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికీ అవకాశం ఉంటుంది. వీటివల్ల పరోక్షంగా రక్తంలో షుగర్‌ లెవల్‌ నియంత్రణలోకి వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.