Toll Plaza: టోల్‌ సిబ్బందికి నో బోనస్‌.. వాహనాలకు ఫ్రీ పాస్‌

దీపావళి పండగకు సరిపడా బోనస్‌ ఇవ్వలేదన్న కారణంతో టోల్‌ సిబ్బంది విధులను పక్కనబెట్టి టోల్‌ గేట్లను ఎత్తేశారు. దీంతో వేలాది వాహనాలు ఎలాంటి ఛార్జీలు కట్టకుండానే ఉచితంగా వెళ్లిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫతేహాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


ఫతేహాబాద్‌ టోల్‌ ప్లాజాను (Toll Plaza) శ్రీ సైన్‌ అండ్‌ డాటర్‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఇక్కడ పనిచేసే 21 మంది సిబ్బందికి కంపెనీ దీపావళి (Deepavali) బోనస్‌గా రూ.1,100 చొప్పున అందించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన టోల్‌ ఉద్యోగులు సోమవారం విధులు బహిష్కరించి ప్లాజా వద్ద ఆందోళన చేపట్టి టోల్‌ గేట్లు తెరిచారు. దీంతో వేల సంఖ్యలో వాహనాలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగా టోల్‌ను దాటి వెళ్లిపోయాయి.

విషయం తెలుసుకున్న టోల్‌ మేనేజ్‌మెంట్‌ వెంటనే ఇతర టోల్‌ ప్లాజాల నుంచి సిబ్బందిని పిలిపించి కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నించింది. కానీ, ఆందోళన చేస్తున్న ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఉద్యోగులతో మేనేజ్‌మెంట్‌ చర్చలు జరిపింది. 10శాతం వేతనం పెంచుతామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో టోల్‌ సిబ్బంది ఆందోళనను విరమించారు. నిరసన వల్ల దాదాపు రెండు, మూడు గంటలు టోల్‌ గేట్లు తెరిచే ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.