క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

గూగుల్ క్రోమ్ (Google Chrome), మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (Mozilla Firefox) బ్రౌజర్‌లను ఉపయోగించే వినియోగదారులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక (High Alert Warning) జారీ చేసింది.


ఈ రెండు బ్రౌజర్‌లలో తీవ్రమైన భద్రతా లోపాలు (Vulnerabilities) ఉన్నాయని, వాటిని సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుని మీ సిస్టమ్‌ను హ్యాక్ చేయవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) స్పష్టం చేసింది.

CERT-In విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం, పాత వెర్షన్‌లలోని ఈ భద్రతా లోపాలు కారణంగా హ్యాకర్లు సులభంగా మీ కంప్యూటర్‌లో నిల్వ చేసిన వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలను దొంగిలించే అవకాశం ఉంది. మీ అనుమతి లేకుండా రిమోట్‌గా సిస్టమ్‌ను యాక్సెస్ చేసి, మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను సందర్శించేలా యూజర్‌ను మోసం చేసి, సిస్టమ్‌లో హానికరమైన కోడ్‌ను అమలు చేయవచ్చు.

డినయల్-ఆఫ్-సర్వీస్ (DoS) అటాక్‌లకు పాల్పడి, సిస్టమ్ సేవలకు అంతరాయం కలిగించవచ్చు. ప్రధానంగా డెస్క్‌టాప్ (విండోస్, మ్యాక్‌ఓఎస్, లైనక్స్) వినియోగదారులకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. అయితే సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి వినియోగదారులు తక్షణమే చేయవలసిన పని బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడమే. భద్రతా లోపాలను సరిచేస్తూ గూగుల్, మొజిల్లా సంస్థలు ఇప్పటికే ప్యాచ్‌లను విడుదల చేశాయి. కాబట్టి, వెంటనే మీ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని CERT-In గట్టిగా సూచించింది.

గూగుల్ క్రోమ్:

క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కల (మెనూ) గుర్తుపై క్లిక్ చేయండి. Help ఆప్షన్‌లోకి వెళ్లి, ఆపై About Google Chrome ఎంచుకోండి. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా వెర్షన్ కోసం తనిఖీ చేసి, అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్‌డేట్ పూర్తైన తర్వాత ‘రీలాంచ్’ (Relaunch) బటన్‌పై క్లిక్ చేయండి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్:

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. కుడివైపు పైభాగంలో ఉన్న మూడు అడ్డగీతల (మెనూ) గుర్తుపై క్లిక్ చేయండి. Help ఆప్షన్‌లోకి వెళ్లి, ఆపై About Firefox ఎంచుకోండి. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా వెర్షన్‌కు అప్‌డేట్ అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.