ప్రస్తుతం ఇండియా మార్కెట్లో మల్టీ పర్పస్ వెహికల్స్‌కు అధిక డిమాండ్ ఉంది. ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి ఈ బాడీ స్టైల్ వెహికల్స్ అనుకూలంగా ఉంటాయి.
ప్రస్తుతం ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా. ఈ మారుతి ఎంపీవీని టయోటా కంపెనీ రీబ్యాడ్జ్ చేసి రూమియన్ పేరుతో విక్రయిస్తుంది. జపనీస్ బ్రాండ్‌లైన సుజుకి, టయోటా మధ్య ఉన్న గ్లోబల్ పార్టనర్ షిప్లో భాగంగా కార్లు, టెక్నాలజీ మార్పిడి జరుగుతుంది. అందులో భాగంగా టయోటా రీబ్యాడ్జ్ చేసిన మారుతి కార్లలో రూమియన్ కూడా ఒకటి.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి టయోటా రూమియన్ అమ్మకాల్లో క్రమంగా తగ్గుదల కనిపించింది. 2025 ఏప్రిల్ నెలలో 2462 యూనిట్లు అమ్ముడయ్యాయి. మే, జూన్ నెలల్లో అమ్మకాలు వరుసగా 1917, 1415 యూనిట్లకు పడిపోయాయి. జూలైలో 576 యూనిట్లకు చేరగా, ఆగస్టులో అది మూడంకెలను కూడా తాకలేదు. ఆగస్టు నెలలో ఈ ఎంపీవీ సేల్స్ కేవలం 68 యూనిట్లు మాత్రమే.
అయితే, 2025 సెప్టెంబర్ నెల రూమియన్ సేల్స్ రిపోర్ట్ ఇప్పుడు విడుదలైంది. గాడివాడి విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2025 సెప్టెంబర్‌లో టయోటా 829 రూమియన్ ఎంపీవీలను విక్రయించింది. 2024 సెప్టెంబర్‌లో ఇది 1,968 యూనిట్లుగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 2025 సెప్టెంబర్‌లో రూమియన్ అమ్మకాల్లో 1,653 యూనిట్ల తగ్గుదల ఉంది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 58 శాతం పడిపోయాయి.
అయితే, కేవలం 68 యూనిట్లకు పరిమితమైన 2025 ఆగస్టు నెలతో పోలిస్తే అమ్మకాలు 91.80 శాతం పెరిగాయి. జిఎస్‌టి సంస్కరణలు రూమియన్ తిరిగి పుంజుకోవడానికి కారణమై ఉండవచ్చు. రూమియన్ ఎంపీవీకి రూ. 37,300 నుండి రూ. 48,700 వరకు ధర తగ్గింది. రూమియన్ S MT వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్‌లకు రూ. 40,000 కంటే ఎక్కువ ధర తగ్గింది.
ప్రస్తుతం రూమియన్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 10.44 లక్షలు. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 14.10 లక్షల నుండి రూ. 13.61 లక్షలకు తగ్గింది. టయోటా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ధరలు నమోదు చేయబడ్డాయి. గత నెలలో టయోటా రూమియన్ బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చి అప్‌డేట్ చేసింది. ఇది కూడా సెప్టెంబర్‌లో అమ్మకాలు పెరగడానికి సహాయపడి ఉండవచ్చు.
కొత్త అప్‌గ్రేడ్‌తో, అన్ని రూమియన్ వేరియంట్‌లలో డ్యూయల్ ఫ్రంట్, సైడ్, కర్టెన్ షీల్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు సేఫ్టీని పెంచడానికి వచ్చాయి. దీనితో పాటు టాప్-స్పెక్ V వేరియంట్‌లో టయర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అందించబడింది తప్ప, రూమియన్‌లో ఇతర మార్పులు చేయలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ISOFIX చైల్డ్-సీట్ మౌంట్‌లు వంటివి రూమియన్ సేఫ్టీ కిట్‌లో ఉన్నాయి.
ఎర్టిగాలో ఉన్న అదే 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ టయోటా రూమియన్‌కు ఎనర్జీని అందిస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 102 bhp పవర్, 137 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంది.
రూమియన్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.11 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ 20.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. సిఎన్‌జి మోడ్‌లో పవర్ , టార్క్‌లు 87 bhp, 121 Nm కి తగ్గుతాయి, కానీ మైలేజ్ పెరుగుతుంది. బై-ఫ్యూయల్ సిఎన్‌జి ఆప్షన్‌కు కిలోగ్రాముకు 26.11 కిలోమీటర్ల మైలేజీని కంపెనీ పేర్కొంది.
ఎర్టిగాకు సమానమైన ఇంటీరియర్‌తో రూమియన్ డ్యూయల్-టోన్ క్యాబిన్, స్ప్లిట్-ఫోల్డింగ్ రెండవ వరుస సీట్లు, రెక్లైనబుల్ మూడవ వరుస సీట్లు, వెనుక వైపు ప్రత్యేక ఎసి వెంట్‌లు వంటి 7 సీటర్ లేఅవుట్‌లో వస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ఆర్కామిస్ ట్యూన్ చేసిన ఆడియో వంటి 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
































