ఒక టిక్, ఒక జీవితపు సంక్షోభం.. డిజిటల్ లోన్ల సత్యం

కప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు అధికారులు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన తర్వాత లోన్ మంజూరు చేయాలా?


వద్దా అని నిర్ణయించడం జరిగేది.. ఇలా చాలా పెద్ద ప్రాసెస్ బ్యాంకు అధికారులకు ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు సుమారు మూడు నాలుగు వారాల సమయం పట్టేది.

ఇప్పుడు అన్‌లైన్‌లో పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని జరిగి పోతుంది. లోన్ ఇచ్చే అన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లోన్‌ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకీ శృతిమించుతున్నాయి.

రుణాలకు ఐదింతల వసూళ్లు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారుల దాడులతో కొన్నాళ్ల పాటు ఇవి ఆగిపోయాయి. ఇప్పుడు వేధింపులు మళ్లీ షురూ అవుతున్నాయి. ఎటువంటి ఆధారాలు అవసరం లేకుండా లోన్ ఇచ్చేస్తున్నారు. సులభ పద్ధతిలో లోన్ ఇస్తామని ఆశ చూపి ఉచ్చులో పడ్డాక ఒకటికి ఐదింతలు ఇచ్చిన రుణాలను లాగుతున్నారు. రుణాలు తీసుకున్నవారు కట్టలేకపోతే గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ విచక్షణా రహిత సంభాషణలతో ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. రుణ గ్రహీత వ్యక్తిగత బయోడేటా చోరీ చేసి, దీని నుంచి వారి కుటుంబ సభ్యుల ఫోటోలు సేకరించి వాటిని న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి మరి వేధింపులకు గురి చేస్తున్నారు. లోన్ యాప్‌ల ఏజెంట్ల దురాగతాలకు వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ఎక్కడ పడితే అక్కడ టిక్ చేస్తే..

యువత రుణం పొందే ఆత్రుతలో కనీసం నియమావళిని చదవకుండా అడిగిన దానికి ఓకే అని టిక్ చేస్తూ చకచక ముందుకు సాగిపోతున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, పాన్ కార్డు నెంబర్ వ్యక్తిగత బయోడేటా యాప్‌ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు వాటి ఆధారంగా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి వేధిస్తూ వాళ్లకు కావాల్సినంత డబ్బు గుంజుతున్నారు. ప్రశ్నిస్తే వాళ్లు సేకరించిన డేటాతో వాళ్ళు ఇష్ట రాజ్యంగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఆవేదన భరించలేక ఒకటికి ఐదింతలు అయినా అప్పు తీర్చలేక ఒత్తిడితో ఆత్మహత్యలు పాల్పడుతున్నారు.

పచ్చి బూతులూ, మార్ఫింగులూ..

బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, ఇలాంటి సూక్ష్మరుణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగులకు కొలువులు లేక చిరుద్యోగులు, చిరువ్యాపారులు ఎంత వడ్డీ అయినా అప్పు దొరకడమే మహద్భాగ్యమనుకున్న పరిస్థితుల్లో సూక్ష్మ రుణాలిచ్చే ఈ యాప్‌లు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సకాలంలో రుణాలు చెల్లించకపోతే లోన్ యాప్‌ల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. పచ్చి బూతులు తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించడం, వినకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు.

ఒక్కసారి చిక్కితే అంతే సంగతులు..

ఈ రోజుల్లో మధ్య తరగతి కుటుంబం జీవితం నడవాలంటే మహా అద్భుతమే. అందుకే కొందరు అప్పులు చేస్తూ తిప్పలు పడుతుంటారు. అలాంటి వారికే ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అప్పులు ఎర వేస్తుంటాయి. ఒక్కసారి చిక్కితే అంతే సంగతులు. తీసుకునే దాకా ఫోన్లతో ఒక తంటా.. తీరా తీసుకున్నాక మరో తంటా. ఏజెంట్ల వేధింపులు, చట్టవిరుద్ధమైన విధానాలు, క్రూరమైన దురాగతాలతో నానా ఇబ్బందులు పడాల్సిందే. వీటి బారిన పడి మరింత మంది మోసపోకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని అక్రమ లోన్ యాప్‌ల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి.

ఏ నియంత్రణా లేని లోన్ యాప్‌లు..

ఈ తరహా ప్రైవేట్ లోన్ యాప్‌లను చైనా, సింగపూర్‌, ఇండోనేసియా తదితర ఇతర దేశాలకు చెందినవారు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. మన చట్టాలను పట్టించుకోకుండా ఇక్కడి వారికి అప్పులిచ్చి అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తీర్చని వారిని రకరకాలుగా వేధిస్తున్నారు. ఈ వ్యవహారాలపై వేలకొద్దీ ఫిర్యాదులు అందుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వీటి నియంత్రణకు ఎటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. లోన్ తీసుకునే వారు కూడా పూర్తిస్థాయిలో సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాత అది గుర్తింపు పొందిన రుణ యాప్ అని ధ్రువీకరించుకున్న తర్వాతే ఆ యాప్ సేవలు వినియోగించుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.