కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
బుధవారం ఉదయం పతనంతిట్ట జిల్లాలోని ప్రమదం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్ కుంగిపోయింది. రాష్ట్రపతి హెలికాప్టర్ హెలిప్యాడ్‌పై దిగిన వెంటనే, హెలికాప్టర్ చక్రాలు తగిలిన ప్రదేశంలో కొత్తగా వేసిన కాంక్రీట్ ఉపరితలం కొద్దిగా కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ అక్కడే చిక్కుకుపోయింది. అయితే, ఈ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దిగిపోయారు.
సోషల్ మీడియాలో వైరల్
ఆమె పంబకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సినందున, ఆమె ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెలికాప్టర్ చిక్కుకుపోయిన ప్రదేశం నుంచి దానిని బయటకు నెట్టడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నట్లుగా ఫొటోలలో కనిపించింది. ముందుగా రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండింగ్ నిలక్కల్ (పంబ సమీపంలో) వద్ద ప్లాన్ చేశారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆఖరి నిమిషంలో ప్రమదం స్టేడియానికి మార్చారు. అత్యవసరంగా స్థలాన్ని మార్చడం వలన, అధికారులు మంగళవారం రాత్రికి రాత్రే అక్కడ హెలిప్యాడ్‌ను కాంక్రీట్‌తో నిర్మించారు. ఈ కాంక్రీట్ పూర్తిగా గట్టిపడకపోవడం వలనే, హెలికాప్టర్ బరువును తట్టుకోలేకపోయి కుంగిపోయిందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.అత్యంత ముఖ్యమైన వ్యక్తి ప్రయాణానికి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నాణ్యత విషయంలో అజాగ్రత్త పట్ల అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
































