ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి పనిలో డబ్బు అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఒకప్పుడు చేతిలో నోట్లు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు వాటితోనే ఎక్కువగా జరిపేవారు. కానీ ప్రస్తుతం మనీ ట్రాన్సాక్షన్ డిజిటల్ మయంగా మారిపోయింది. దీంతో అంతా ఆన్లైన్లోనే ఆర్థిక వ్యవహారాలు సాగిస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్లో ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పరిమితికి మించి ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్కమ్ టాక్స్ శాఖ నుంచి నోటీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఒక వ్యక్తి ఎంతవరకు నగదు ఇచ్చిపుచ్చుకోవాలి? లేకపోతే ఏమవుతుంది?
ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 269ST ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు రూ. 2 లక్షల ఆర్థిక వ్యవహారాలు జరపవచ్చు. అయితే అంతకుమించి నగదు తీసుకోవడం లేదా ఇవ్వడం గానీ చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరాలు ఉండాలి. ఆ వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి. అలా చెప్పానీ పక్షంలో పరిమితికి మించిన ట్రాన్సాక్షన్ పై జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఈ జరిమానా నిబంధనల కంటే ఎంత ఎక్కువగా నగదు ఉంటే అంత మొత్తంలో విధించే అవకాశం ఉంటుంది. కొందరు వ్యాపారులు కరెంట్ ఖాతాను నిర్వహించే అవకాశం ఉంది. వీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల నుంచి ఆర్థిక వ్యవహారాలు జరపడానికి వీలులేదు. ఒకవేళ తమ కరెంట్ ఖాతా లిమిట్ ను పెంచుకోవడానికి బ్యాంకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ ఆయా ఆర్థిక వ్యవహారాలు జరిపే వాటిపై లిమిట్ ఇస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డు బిల్లులు వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో అయితే లక్ష వరకు.. ఆన్లైన్లో అయితే రూ. 10 లక్షల వరకు బిల్లులు చెల్లించవచ్చు. అంతకుమించి చెల్లించాల్సి వస్తే ఇన్కమ్ టాక్స్ కు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు రూ. 10 లక్షల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకుమించి డిపాజిట్లు లేదా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే వాటి విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఎవరికైనా రుణం ఇవ్వాలంటే రూ.20,000 మించరాదు. రుణం తీసుకోవడంలోనూ ఇదే పరిమితి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఉల్లంఘనకు పాల్పడితే ఇన్కమ్ టాక్స్ చట్టం సెక్షన్ 269 SS ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బ్యాంకు ఖాతా నుంచి ఒకేసారి కోటి రూపాయల కంటే ఎక్కువగా నగదు విత్ డ్రా చేస్తే 2 శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నగదు వ్యవహారాలు జరిపేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు లోబడి ఆర్థిక వివరాలు జరపని పక్షంలో ఒక్కోసారి జరిమానా విధిస్తారు. అయితే పదేపదే ఇలాంటి తప్పులు చేయడం వల్ల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు.
































