ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయ్.. అప్పుడే అసలైన స్వేచ్ఛ.. ఎలాన్ మస్క్ పోస్టు వైరల్

ఏఐ ఎఫెక్ట్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంపై కనిపిస్తోంది. అనేక సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2027 కల్లా వర్కర్ల స్థానంలో ఏఐ, రోబోలను భారీగా నియమించుకోవాలని అమెజాన్ సంస్థ యోచిస్తోందన్న వార్త ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. 1.6 లక్షల ఉద్యోగులను ఏఐతో భర్తీ చేయాలని సంస్థ చూస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో, నెట్టింట ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది (Elon Musk on AI Future).


ఈ ఉదంతంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఏఐ, రోబోట్స్ వల్ల ఉద్యోగాలన్నీ తొలగిపోవడం పక్కా అని అన్నారు. ఉద్యోగుల స్థానంలో ఏఐ, రోబోట్స్ వచ్చి చేరతాయని పేర్కొన్నారు. ఆ తరువాత మనుషులకు అసలైన స్వేచ్ఛ లభిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. పని చేయడం అనేది ఐచ్ఛికంగా మారుతుందని తెలిపారు. కూరగాయలు సాగు చేయడం వంటివి హాబీలుగా చేపట్టొచ్చని అన్నారు.

ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలందరికీ సార్వత్రిక ఆదాయ విధానం అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. జనాలకు పని చేయాల్సిన అవసరం లేకుండానే తమకు నచ్చిన జీవైన శైలిని కొనసాగించే అవకాశం ఏఐతో కలుగుతుందని కూడా అన్నారు. దీంతో, ఈ టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మస్క్ గతంలో కూడా ఏఐ ప్రాబల్యంపై స్పందించారు. పారిస్‌లో గతేడాది జరిగిన వీవాటెక్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ దాదాపు ఇదే కామెంట్స్ చేశారు. ఏఐ ఆధారిత భవిష్యత్తు సాకారమయ్యే అవకాశం దాదాపు 80 శాతం ఉందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత సహాయకులుగా సేవలందించే రోబోలు అందుబాటులోకి రావొచ్చని కూడా చెప్పుకొచ్చారు. మస్క్ స్వయంగా ఈ భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నారు. మాక్రోహార్డ్ పేరిట ఉద్యోగులే లేని ఓ ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ కంపెనీని అభివృద్ధి చేస్తున్నారు. స్వతంత్రంగా పనులు చేసుకుపోయే ఆప్టిమస్ రోబోట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.