నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలపై రకరకాల ఆశలు పెట్టుకుంటున్నారు. వాటిని సాధించి తీరాలంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక స్థితి ప్రభావితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను పెంచే క్రమంలో తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం…
- పిల్లలందరి శక్తి సామర్థ్యాలు, ఆలోచన తీరు ఒకేరకంగా ఉండవు. కాబట్టి పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైన శిక్షణ ఇప్పించాలి.
- క్రమశిక్షణ పేరుతో పిల్లలకు కఠినమైన ఆంక్షలు పెట్టకూడదు. కేవలం చదువుకు మాత్రమే ప్రాముఖ్యమిస్తే పిల్లలు ఆటపాటల్లో రాణించలేరు. అంతేకాదు వాళ్లకు.. ఇతరులతో మాట్లాడే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, పోటీ తత్త్వం అలవడవు.
- పిల్లలు ఏవైనా పొరబాట్లు చేస్తే వారిపై కోపం చూపించకూడదు. సామరస్యంగా వ్యవహరించి మంచి, చెడుల తారతమ్యాన్ని వివరించాలి.
- పరీక్షల్లో మార్కులు తగ్గాయనో, ఆటల్లో ఓడిపోయారనో పిల్లలను ‘నీకేమీ చేతకాదు’ అంటూ నిరాశ పరచకూడదు. దీనివల్ల పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మరో ప్రయత్నం చేసి అనుకున్నది సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలి.
- పిల్లల ఇష్టాలు, ఆశయాలు తెలుసుకోకుండా చెప్పిన మాట వినాలంటూ ఒత్తిడి చేయకూడదు. పిల్లలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల అభిరుచులను గమనిస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి.
- పిల్లల మీద అతిగా ప్రేమ చూపిస్తూ వాళ్లు ఏమి చేసినా సమర్థించడం కూడా మంచిది కాదు. పిల్లలకు సమయపాలన, తోటివారితో స్నేహంగా ఉండడం, పెద్దలతో మర్యాదగా మెలగడం, సమయస్ఫూర్తి నేర్పించాలి. పోషకాహారం, వ్యాయామం, వ్యక్తిగత శుభ్రతల గురించి తెలియజెప్పాలి.
Post Views: 49
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.