ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఓ ఇండియన్ టీవీ సీరియల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారంటే నమ్మగలరా? కానీ మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటిస్తున్న క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ 2 సీరియల్లో ఆయన కనిపించబోతున్నారు.
నటి, రాజకీయవేత్త స్మృతి ఇరానీ తన ఐకానిక్ షో క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ కొత్త సీజన్ తో తిరిగి బుల్లితెరపైకి వచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు ఈ షోకి ఒక ప్రత్యేకమైన అతిథి రాబోతున్నారు. ఆ అతిథి మరెవరో కాదు.. మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్ బిల్ గేట్స్. ఆయన రాకతో ఈ షో మరింత ఆసక్తికరంగా మారనుంది.
సీరియల్లో బిల్ గేట్స్
రాజకీయాల్లోకి రాక ముందు స్మృతి ఇరానీ ఈ క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ ద్వారానే బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాది మొదట్లో ఇదే సీరియల్ కొత్త సీజన్ ప్రారంభం కాగా.. దీనికి ఆమె తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు మేకర్స్ ఒక ప్రోమో విడుదల చేశారు. దాని ప్రకారం ఈ షో తదుపరి ఎపిసోడ్‌కు ఒక ప్రత్యేక అతిథి రాబోతున్నట్లు టీజ్ చేశారు. ఆ ప్రత్యేక అతిథి మరెవరో కాదు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్ బిల్ గేట్స్.
బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన టీజర్‌లో.. స్మృతి ఇరానీ అలియాస్ తులసి తన ల్యాప్‌టాప్ తెరిచి వీడియో కాల్‌లోకి వచ్చింది. “జై శ్రీకృష్ణ, మీరు నేరుగా అమెరికా నుంచి మా కుటుంబంతో కనెక్ట్ అవుతున్నారని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ కోసం మేమంతా ఆతృతగా ఎదురుచూస్తున్నాం” అని తులసి అంటుంది.
ఈ టీజర్‌లో అతిథి ముఖాన్ని చూపించలేదు. అతిథి ఎవరో త్వరలోనే తెలుస్తుందని స్మృతి అప్పుడు టీజ్ చేసింది. గురువారం, శుక్రవారం ఎపిసోడ్‌లలో ప్రత్యేక అతిథి కనిపిస్తారని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
మరిన్ని వివరాలు
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మాజీ మంత్రి అయిన స్మృతి, టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించింది. “భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇది ఒక చారిత్రక క్షణం” అని ఆమె అనడం గమనార్హం.
ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సిరీస్‌లో స్మృతి ఇరానీ తులసి విరాణిగా, అమర్ ఉపాధ్యాయ్ మిహిర్‌గా మళ్లీ లీడ్ పెయిర్‌గా వస్తున్నారు. వీరితో పాటు రోహిత్ సుచంతి, తనిషా మెహతా, శగున్ శర్మ, అమన్ గాంధీ వంటి కొత్త తరం పాత్రలు కూడా ఉన్నాయి.
ఒరిజినల్ సిరీస్ ఎనిమిది సంవత్సరాలు 1833 ఎపిసోడ్‌లు నడిచింది. అయితే ఈ రీబూట్ 150 ఎపిసోడ్‌ల లిమిటెడ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఈ షో స్టార్ ప్లస్‌లో ఈ ఏడాది జులై 29న ప్రసారం కాగా, జియోహాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంది.
































