రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు.
ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం, అక్కడి బాక్సాఫీస్ వసూళ్లే ఆయన యూనివర్సల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తాయి. తన స్టార్డమ్, ఛరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలుంటారు, కానీ టాలీవుడ్‌కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ చిత్రాలు రీ-రిలీజ్ కావడం, కొత్త సినిమాల అప్డేట్స్ రావడం ఆనవాయితీ. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది ఎపిక్’ (రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్‌గా) తిరిగి విడుదల కానుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
క్రేజీ లైనప్
ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్-వరల్డ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన లైనప్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
ది రాజా సాబ్: డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వీటితో పాటు, డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఒక సినిమా, సందీప్ వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ చిత్రాలపై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అలాగే ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాల కోసం కూడా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ మాత్రమే కాదు.. అందరి ‘డార్లింగ్’
బాక్సాఫీస్ రికార్డులు ప్రభాస్‌ను ‘స్టార్’గా నిలబెడితే, ఆయన వ్యక్తిత్వం ఆయన్ను అందరి ‘డార్లింగ్’ని చేసింది. మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం.. ఇవే ప్రభాస్‌ను అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మార్చాయి. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. రెబల్ స్టార్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే!
































