భారతదేశంలో రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా, జావా వంటి సంస్థలు దూసుకుపోతుంటే జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) మాత్రం దూరం నుండే చూస్తోంది.
ఒకప్పుడు ఆర్ఎక్స్100 (RX100) వంటి అద్భుతమైన బైక్‌లతో దేశాన్ని ఏలిన ఈ సంస్థ, ఇప్పుడు యువతను మాత్రమే టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది. ఆర్15, ఎమ్‌టి15, ఎఫ్‌జెడ్ వంటి పవర్ఫుల్ మోడల్స్ కంపెనీకి ప్రధాన ఆయుధాలు. అయితే, త్వరలోనే యమహా ఒక కొత్త ఆయుధాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడానికి సిద్ధమవుతోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ (Hunter), టీవీఎస్ రోనిన్ (TVS Ronin) వంటి నియో రెట్రో మోడల్స్ విభాగంలోకి కంపెనీ కొత్త బైక్‌ను తీసుకురాబోతోంది. చాలా కాలంగా భారతీయులు కోరుకుంటున్న ఎక్స్ఎస్ఆర్155 అనే అద్భుతమైన బైక్ యమహా భారతదేశంలోకి రాబోతోంది. భారత మార్కెట్‌లో కొత్త ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి యమహా సిద్ధమవుతోందని వార్తలు ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటాయి.
కొత్త ఉత్పత్తి ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ, యమహా ఏ వాహనాన్ని తీసుకువస్తుందో ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. అది ఎక్స్ఎస్ఆర్155 కావొచ్చు లేదా కొత్త స్కూటర్ కావొచ్చు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, ఇటీవల ఎక్స్ఎస్ఆర్155 చాలాసార్లు రోడ్లపై పరీక్షలు జరిపింది, కాబట్టి ఈ నియో రెట్రో మోటార్‌సైకిల్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా, నవంబర్ 11న కొత్త మోడల్‌ను దేశానికి అందించనున్నారు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు జాగ్రత్తగా కృషి చేయకపోతే యమహా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఎక్స్.ఎస్.ఆర్. వస్తే యువత అంతా వాహనం కొనేందుకు క్యూ కడతారని అంచనా. ఎవరినైనా ఆకట్టుకునే రూపం దీని ప్రధాన ఆకర్షణ.
ఎక్స్ఎస్ఆర్155లో గుండ్రని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ముందు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లు, కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ఇంధన ట్యాంక్, ఎల్ఈడీ ఇండికేటర్లు, ఫ్లాట్ బెంచ్-రకం సింగిల్ పీస్ సీటు, సన్నని వెనుక భాగం అన్నీ యమహా నియో రెట్రో రోడ్‌స్టర్‌ను అందంగా మారుస్తాయి. ఇతర మెకానికల్ విషయాలలో, 17 అంగుళాల వీల్స్, రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు, వెనుక మోనో-షాక్ వంటివి ఇందులో ఉంటాయి.
ఆర్15 వి4 స్పోర్ట్స్ బైక్ అదే ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటున్న ఎక్స్ఎస్ఆర్155 అదే ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. 155 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ స్వల్పంగా మార్పులు చేయబడింది. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజిన్ 18.1 బిహెచ్పీ శక్తితో గరిష్టంగా 14 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేయగలదు.
యమహా రాబోయే నియో-రెట్రో రోడ్‌స్టర్‌ను దాని ఇతర మోడల్స్ నుండి భిన్నంగా నిలబెట్టేది దాని నిటారుగా ఉండే ప్రయాణ భంగిమ. దీని కారణంగా ఎంత దూరం అయినా అలసట లేకుండా ప్రయాణించవచ్చు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను తగ్గించడంతో, జపాన్ ద్విచక్ర వాహన తయారీదారులు తక్కువ ధరలో ఎక్స్ఎస్ఆర్155ను విడుదల చేయగలుగుతారు.
ఒకవేళ దీనికి బదులుగా స్కూటర్ మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంటే, అది ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఎన్‌మ్యాక్స్ 155 అయి ఉండవచ్చు. హీరో జూమ్ 160, టీవీఎస్ ఎన్ టార్క్ 150ల విడుదలతో మ్యాక్సీ-స్కూటర్ విభాగం భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కంపెనీ భావించవచ్చు. ఏది ఏమైనా, నవంబర్ 11న ఈ సస్పెన్స్‌కు తెర పడుతుంది.
































