ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనకు రంగం సిద్దం అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ల మేరకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నియమించిన మంత్రివర్గ ఉప సంఘం పని మొదలు పెట్టింది.
దాదాపుగా కొత్త జిల్లాలు.. మండలాల పైన సూత్ర ప్రాయంగా ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు తిరిగి పాత జిల్లాల్లో కలవనున్నాయి. ఈ మేరకు జనవరిలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన కీలక అడుగు వేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 32కి పెరగనున్నాయి. కొత్తగా ఆరు జిల్లాల పై దాదాపు స్పష్టత వస్తోంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. ఇక.. రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది.
తాజాగా రెవిన్యూ అధికారులు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు.. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు అవసరమైన నివేదికను ఇవ్వాలని నెల్లూరు, బాపట్ల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో వచ్చే జనవరి నాటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుతోపాటు ఒంగోలు కేంద్రంగా కొనసాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను మూడు జిల్లాల్లోకి విభజించారు. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి, నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల వారు తమను ప్రకాశంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మొత్తుకున్నారు. దీంతో, నాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు, అద్దంకి లను ఒంగోలులో చేరుస్తామని స్పష్టంగా చెప్పారు. కాగా, వచ్చే జనవరిలో జిల్లాల పునర్‌వ్యవ స్థీకరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
































