తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ ట్రస్టులకు విరాళాలు పెరిగాయి. గత పదకొండ నెలల కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయి.
విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు సమర్పిస్తున్నారు. టీటీడీకి వచ్చిన విరాళాల లెక్కలను టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో టీటీడీ ట్రస్టులకు వచ్చే విరాళాలు పెరిగాయి. వివిధ ట్రస్టులకు గత 11 నెలల్లో మొత్తం రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విరాళాల ద్వారా తిరుమల భక్తుల భక్తిశ్రద్ధ, దేవాలయంపై ఉన్న విశ్వాసం ఎంత గాఢంగా ఉందో మరోసారి రుజువైంది. వీటిలో ఆన్లైన్ ద్వారా రూ.579.38 కోట్లు, ఆఫ్‌లైన్ ద్వారా రూ.339.2 కోట్లు సమకూరాయి. ఈ మొత్తం దానాల ద్వారా దేవస్థానం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం అవుతాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అత్యధికంగా రూ.338.8 కోట్లు విరాళాల రూపంలో చేరాయి.
అదే విధంగా శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు రావడం గమనార్హం. ఈ ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు పొందే విధానం సులభతరం చేయడమే కాకుండా, వచ్చిన విరాళాలను వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అలాగే ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్ల విరాళాలు అందాయి.
తిరుమలలో శ్రీవారి సేవా కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా భక్తుల సహకారంతో కొనసాగుతున్నాయి. భక్తులు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ విరాళాల ద్వారా TTD విద్య, వైద్యం, గోసంరక్షణ, అన్నప్రసాదం వంటి పుణ్య కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.































