గోదావరి జిల్లాల్లో పులస చేపల తర్వాత అంతటి ప్రత్యేకత చీరమేనుకు ఉంది. ఏటా అక్టోబరు, నవంబరులో గోదావరిలో లభించే చీరమేను పేరు వింటే మాంసాహార ప్రియులు లొట్టలేస్తారు. సముద్ర ముఖ ద్వారానికి చేరువలో నదీ తీరంలో దీని లభ్యత ఎక్కువ. పదేళ్ల కిందట పశ్చిమగోదావరి తీరంలో ఏటా 10 టన్నులకు పైగా లభ్యత ఉండగా.. జల కాలుష్యంతో ఇప్పుడు 2 టన్నులకు పడిపోయింది. దీంతో ధరలు చుక్కలకెక్కాయి. పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సరిహద్దుల్లోని చేపల మార్కెట్లలో ప్రస్తుతం బకెట్ (సుమారు 12 కిలోలు) చీరమేను రూ.20 వేల వరకు పలుకుతోంది. రిటైల్‌గా అయితే దాదాపు పావు లీటరు రూ.వెయ్యికి పైమాటే.
ఒడ్డునే లభ్యం.. ఈ చేపల పరిమాణం 2 సెంటీమీటర్ల లోపు ఉంటుంది. గాలుల ప్రభావంతో సమూహాలుగా తీరానికి సమీపాన సంచరిస్తాయి. ఇంత చిన్న చేపలను వలలతో వేటాడటం సాధ్యం కాదు. చీరను నదిలో ముంచి పైకి లాగుతూ వీటిని సేకరిస్తారు. అందుకే వీటికి చీరమేనుగా పేరొచ్చింది.
పర్యాటకులకు మక్కువ.. గోదావరి జిల్లాలకు వచ్చే పర్యాటకులు సైతం చీరమేను వంటకాలపై మక్కువ చూపుతుంటారు. వారు బస చేసే అతిథిగృహాల్లో ఈ సీజన్లో దీనిని ప్రత్యేక వంటకంగా వడ్డిస్తారు. సాధారణంగా వీటిని చింత చిగురు లేదా చింతకాయతో కలిపి ఇగురులా వండుతారు. మామిడికాయతో కలిపి వేపుడుగా ఆరగించేందుకు కొందరు ఇష్టపడతారు.
గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో మడ అడవుల వద్ద బురద మడుగుల్లో ఈ చేపలు గుడ్లు పెడతాయి. సముద్రం మీదుగా తూర్పు గాలులు వీచినప్పుడు గుడ్లు పిల్లలుగా మారి నదిలోకి ఈదుకొస్తాయి. వీటిని పక్షులు గుర్తించి తినడానికి నీటిపై ఎగురుతుంటాయి. ఈ సంకేతాలను మత్స్యకారులు గమనించి చీరమేను వేటకు సిద్ధమవుతారు.
మనుగడకు ముప్పు.. జల కాలుష్యం, మడ అడవులు తగ్గిపోవడంతో చీరమేను మనుగడకు ముప్పుగా మారింది. ఇది చేప మాత్రమే కాదు పర్యావరణ సూచిక కూడా. అందుకే ఈ జాతి చేపల పరిరక్షణను అంతా బాధ్యతగా భావించాలి.
































