భారత ఆర్మీ గుడ్ న్యూస్: అగ్నివీర్ పథకంలో విప్లవాత్మక మార్పులు

భారత సైన్యంలో ఉద్యోగం చేయాలని కలలు కనే వేలాది మంది యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీలో అగ్నివీరుల నిలుపుదల(రిటెన్షన్) రేటును భారీగా పెంచే ప్రతిపాదనపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ప్రస్తుతం కేవలం 25 శాతంగా ఉన్న ఈ రేటును ఏకంగా 75 శాతం వరకు పెంచాలని సైన్యం యోచిస్తోంది. ఇది అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరాలనుకునే యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

కీలక ప్రతిపాదన.. కమాండర్ల సమావేశంలో చర్చ

ఓ నివేదిక ప్రకారం.. నేడు(అక్టోబర్ 23) రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఆర్మీ కమాండర్ల అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించబోయే ప్రధానాంశాలలో అగ్నివీరుల నిలుపుదల రేటును 25% నుంచి 75%కి పెంచే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే అగ్నివీర్ పథకం కింద నియమించబడే 100 మంది యువకులలో 75 మందికి భారత సైన్యలో శాశ్వత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇది నిస్సందేహంగా యువతలో సైనిక సేవ పట్ల ఆసక్తిని, భద్రతా భావాన్ని రెట్టింపు చేస్తుంది.

మొదటి బ్యాచ్ పదవీకాలం పూర్తి నేపథ్యంలో వేగం

అగ్నివీరుల మొదటి బ్యాచ్ తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని వచ్చే ఏడాది (2026) పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై సైన్యం అత్యంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. అగ్నివీర్ల భవిష్యత్తు, పథకానికి సంబంధించి సమర్థత దృష్ట్యా ఈ చర్య చాలా కీలకంగా పరిగణించబడుతోంది.

త్రివిధ దళాల సమన్వయం.. భద్రత సమీక్ష:

జైసల్మేర్ సమావేశంలో కేవలం అగ్నివీర్ అంశమే కాకుండా, దేశ భద్రతకు సంబంధించిన ఇతర కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. భారత ఆర్మీ, వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్), నౌకాదళం (నేవీ) మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించనున్నారు. సైన్యం వ్యూహాత్మక మిషన్ ‘సుదర్శన్ చక్ర’పై పురోగతి, కార్యాచరణపై సమీక్షించనున్నారు. సరిహద్దుల వద్ద, దేశంలో ఎదురవుతున్న కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు. ఈ సమావేశం మే 2025లో ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి కమాండర్ల సమావేశం కావడ గమనార్హం.

మాజీ సైనికుల అనుభవాన్ని వినియోగించుకునే యోచన

పెరుగుతున్న మాజీ సైనికుల సంఖ్య, వారి అపారమైన అనుభవాన్ని దేశ నిర్మాణం, ఇతర వ్యవస్థలలో ఉపయోగించుకోవడంపై కూడా కమాండర్లు చర్చిస్తున్నారు. ప్రస్తుతం వారు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES), ఈసీహెచ్ఎస్ (ECHS) పాలిక్లినిక్స్ వంటి పరిమిత విభాగాల్లో పనిచేస్తున్నారు. అయితే, వివిధ సైనిక, పౌర నిర్మాణాలలో వారి విస్తృత భాగస్వామ్యం గురించి ఇప్పుడు కీలక పరిశీలన జరుగుతోంది.

యువతకు ప్రోత్సాహం

అగ్నివీర్ ప్రతిపాదనకు ఇప్పటికే సైన్యంలో అంతర్గత ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఈ మార్పు యువతలో సైన్యంలో చేరేందుకు మరింత ఉత్సాహం నింపుతుందని, సైన్యం సీనియర్ నాయకత్వానికి ఈ సమావేశం కీలకమైన వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుందని వర్గాలు వెల్లడించాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.