- ఈసారి ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి ఆఖర్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- గతేడాది మార్చి5న ప్రారంభమైన పరీక్షలు 25న ముగిశాయి. అయితే ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి ఆఖర్లో ప్రారంభించి ఫిబ్రవరి మొదటివారంలో పూర్తి చేయనున్నారు. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్‌తోపాటు ఫీజులకు సంబంధించి ఇంటర్ బోర్డు చేసిన ప్రతిపాదనను ప్రభుత్వంగురువారం ఆమోదించింది. పరీక్షలు ముందుగా నిర్వహిస్తే సెకండియర్ విద్యార్థులు ఎప్‌సెట్, ఐఐటీలాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేందుకు మరింత సమయం లభించనుంది. అలాగే పరీక్షలు ముందుగా ముగించి ఫలితాలు ప్రకటిస్తే.. కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపుపై అధ్యాపకులు పూర్తిగా దృష్టిసారించే అవకాశాలుంటాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇకఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో విద్యార్థికి రూ.30 చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థి నుంచి రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
































