రోడ్డు ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD 01 N 9490) కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టింది. అయితే, ప్రమాదానికి గురైన బైక్ ఏకంగా బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకి నిప్పురవ్వలు ఎగసిపడటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.
అయితే, 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడగా.. 20 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయులుగా బయటపడిన వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హరిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేశ్, సుబ్రమణ్యం ఉన్నారు.
































