దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ట్యాక్సీ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్ లకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీని ప్రారంభించింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి.
డ్రైవర్లకు పూర్తిగా యాజమాన్య హక్కులు ఇచ్చి.. వారి ఆదాయంపై వారికే అధికారం ఉండేలా ఈ నిబంధనలను అమర్చారు. ప్రైవేట్ సంస్థలు అధికంగా పుట్టుకొస్తున్న క్రమంలో వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల నుంచి కేంద్రానికి కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. పాత వాహనాలను వినియోగించడం, ఇష్టారీతిన క్యాబ్ ధరలను పెంచేయడం, భద్రత లేని ప్రయాణం, సడెన్ క్యాన్సిలేషన్, సడెన్ గా రేట్లు పెరగడం.. ఇలా అనేక ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల నుంచీ నిరసన వ్యక్తం అవుతోంది. వారి వద్ద నుంచి కంపెనీ అత్యధికంగా కమిషన్ తీసుకుంటోందని వాపోతున్నారు. తమ ఆదాయంలో దాదాపు 25 శాతం కమిషన్లకే పోతుందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భారత్ ట్యాక్సీ విధానంలో ఇవన్నీ మారనున్నాయి. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుందని, ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుందని కేంద్రం చెబుతోంది. ఈ భారత్ ట్యాక్సీ లాభాలు కంపెనీకు కాకుండా లబ్ధిదారులకే చేరుతాయని వివరిస్తోంది.
ఈ మేరకు 2026 మార్చి నాటికి భారత్ ట్యాక్సీ సేవలను దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తృతం చేయాలని యోచిస్తోంది. తొలుత మెట్రో నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత పట్టణ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేసింది. ఈ మేరకు తొలి దశలో దేశవ్యాప్తంగా దాదాపు 5000 మంది పురుషులు, మహిళా డ్రైవర్లను భారత్ ట్యాక్సీ విధానంలో ఉపయోగించుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. భారత్ ట్యాక్సీ యాప్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడింగ్ చేసుకుని మీకు నచ్చిన భాషలో సెట్టింగ్ చేసుకుని యాప్ ను వినియోగించుకోవచ్చు. ఫైలట్ విధానంలో ఈ నవంబర్ లో దిల్లీలో 650 భారత్ ట్యాక్సీలను ప్రారంభించనున్నారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది భారత్ ట్యాక్సీ డ్రైవర్లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
































