‘మోంథా’ దూసుకొస్తోంది

బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది.


దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని, 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. 27వ తేదీ ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారే అవకాశం ఉందంది.

ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సూచనల ప్రకారం ఈ తుపాన్‌కు మోంథాగా నామకరణం చేయనున్నారు. అల్పపీడనం ప్రభావంతో 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇది తుపాన్‌గా మారిన అనంతరం 27, 28 తేదీల్లో తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

26 నుంచి మోస్తరు వర్షాలు కోస్తాంధ్ర అంతటా మొదలవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్‌ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్‌ 15వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుసూ్తనే ఉంటాయని చెబుతున్నారు.

పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం
ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో 5.9, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం బుట్టాయగూడెం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

24 గంటల వ్యవధిలో..
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 14.4, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో 13, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 12.3, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 12.2, నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరులో 11.6, ప్రకాశం జిల్లా టంగుటూరులో 11.3, వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నెల్లూరు, కోనసీమ, పశ్చిమగోదావరి, అనంతపురం, వైఎస్సార్, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మోంథా అంటే..
మోంథా అంటే థాయ్‌ భాషలో సువాసన వెదజల్లే పుష్పం అని అర్థం. ఈ పేరును థాయ్‌లాండ్‌ సూచించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాన్‌ 28 లేదా 29వ తేదీల్లో కాకినాడ, ఒంగోలు మధ్యలో తీరం దాటే సూచనలున్నాయని.. 26వ తేదీకి స్పష్టత వస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ తుపాన్‌ ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ మొత్తం తీర ప్రాంతమంతా ఉంటుందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.