మరో స్లీపర్‌ బస్సులో మంటలు.. డ్రైవర్ కు కృతజ్ఞతలు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు కర్నూలు వద్ద ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు.


ఆ ఘటన ఇంకా మరువక ముందే మరో ఏసీ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆ బస్సులోనూ 39 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.

అవును… కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురుచేసిన వేళ… ఆదివారం మరో స్లీపర్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా.. ఆగ్రా-లఖ్‌ నవూ ఎక్స్‌ ప్రెస్‌ వే పై ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన తెల్లవారుజామున 4:45 గంటలకు, టోల్ ప్లాజాకు సుమారు 500 మీటర్ల ముందు జరిగింది. ఈ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు వ్యాపించే ముందు ప్రయాణికులంతా సేఫ్ గా దిగిపోయారు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు. మూడు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి చేరుకుని ఒక గంటలోపు మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో బస్సు యజమాని ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసి, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.

ఈ క్రమంలో… కాలిపోయిన బస్సును ఎక్స్‌ ప్రెస్‌ వే నుండి తొలగించిన అనంతరం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ బస్సులలో భద్రతా లోపాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ సంఘటన జరిగింది. ఒక నెలలోపు, భారతదేశంలో రెండు ఘోరమైన బస్సు మంటలు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు!

డ్రైవర్ కు థాంక్స్!:

కర్నూలు లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులను కాపాడటానికి ప్రయత్నించకుండా డ్రైవర్ పారిపోయాడని, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఆపలేదని చెబుతూ అతడివైపూ పలు వెళ్లు చూపిస్తున్న వేళ.. తాజా ఘటనలో మాత్రం డ్రైవర్ ను ప్రయాణికులు, ప్రజలు అభినందిస్తున్నారు. కారణం… మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ సందర్భంగా స్పందించిన డ్రైవర్ జగత్ సింగ్… మొదట బస్సు చక్రంలో ప్రారంభమైన మంటలు వాహనంలోని మిగిలిన భాగాలకు వ్యాపించాయని తెలిపారు.

కాగా… అక్టోబర్ ప్రారంభంలో జైసల్మేర్‌ లో జరిగిన మరో భయంకరమైన అగ్నిప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు! బస్సు ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది సంభవించిందని చెబుతున్నారు! దీని తర్వాత తాజాగా కర్నూలు ఘటన చోటు చేసుకుంది!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.