ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఆదివారం రాత్రికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మంగళవారం ఉదయానికి తీవ్రతుపానుగా మారి, ఆ రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు.
జిల్లాలకు టిఆర్-27 కింద నిధులు మంజూరు
సహాయక చర్యలకోసం 9SDRF, 7NDRF జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లాలకు టిఆర్-27 క్రింద నిధులు మంజూరు చేశామన్నారు. బాధితులను సహాయ శిబిరాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు అత్యవసర మరమ్మతులు, ఇతర సహాయ కార్యకలాపాలు కోసం నిధులు వినియోగించాలని తెలిపారు.
విద్యా సంస్థలకు సెలవులు
గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో 3 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుపాను ముప్పు, భారీ వర్షాల కురుస్తయన్న వాతావరణశాఖ ప్రకటనతో అక్టోబర్ 27, 28, 29 తేదీలలో సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో అక్టోబర్
27, 28 తేదీలలో సెలవు ప్రకటించారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా కొన్ని ఇతర జిల్లాల్లోనూ సెలవులు ప్రకటిస్తున్నారు.
నెల్లూరు జిల్లా లో ఈ నెల 27న (సోమవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జానియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం
కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంగళవారం
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
































