సల్మాన్‌పై పాక్‌ ఉగ్ర ముద్ర

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను పాకిస్తాన్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది.


ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది.

ఉగ్రవాద వ్యతిరేక చట్టం-1997లోని నాలుగో షెడ్యూల్‌ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్‌ను పాక్‌ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్‌ 16వ తేదీన బలూచిస్తాన్‌ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాజాగా పాక్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్‌ దోహదకారి (ఆజాద్‌ బలూస్తాన్‌ ఫెసిలిటేటర్‌)గా అందులో పేర్కొంది.

దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్‌ ఫోరం-2025 అక్టోబర్‌ 17న రియాద్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్‌ ఖాన్‌ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్‌ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్‌ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.