ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుపాను ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమ్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రోజన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు.
విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లో రేపు, ఎల్లుండి (అక్టోబర్ 27,28) సెలవులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో అధికారులు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాను మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పడంతో… కాకినాడ జిల్లాల్లో పాఠశాలలకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మూత పడనున్నాయి.
ఏయే జిల్లాల్లో అంటే…
>> కృష్ణా జిల్లాల్లో రేపటి నుంచి మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 27 , 28 , 29 తేదీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తునున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలజీ ఒక ప్రకటనలో తెలిపారు.
>> బాపట్ల జిల్లాలో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ నెల 27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు.
>> తుపాన్ ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి 31 వరకూ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు.
>> భారీ వర్షాల నేథ్యంలో విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
>> మొంథా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు (అక్టోబర్ 27,28,29) అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
>> భారీ వర్షాల దృష్ట్యా ఈ నెల 27, 28న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు.
>> మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా వైస్సార్ కడప జిల్లాలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27, 28వ తేదీలలో సెలవులను ప్రకటిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు.
>> భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పాఠశాలలకు ఈనెల 27, 28, 29 రోజుల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా చెప్పారు.
>> మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎన్టీఆర్ జిల్లాలో మూడు రోజుల (అక్టోబర్ 27, 28, 29) పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
>> తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. వాతావరణంలో మార్పుల వలన ఈనెల 27, 28 తేదీలలో ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు.
ఇక, ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ఈ వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిందని పేర్కొంది. ఇది మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని వెల్లడించింది. ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 770 కి.మీ, విశాఖపట్నంకి 820కి.మీ, కాకినాడకి 810కిమీ దూరంలో కేంద్రీకృతం అయి ఉందని తెలిపింది. మొంథా తుపాను మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ప్రభావంతో సోమవారం రోజున కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే తీర ప్రాంత జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని తెలిపింది. ఇక, మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
































