హైదరాబాద్ నగరంలో విదేశీ పండ్ల పట్ల పెరుగుతున్న మక్కువను అందిపుచ్చుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమాంగూడకు చెందిన రైతు బకారం బుచ్చిరెడ్డి లాభదాయకమైన ‘గ్రేట్ అమెరికన్ కంట్రీ’ (గాక్) ఫ్రూట్ సాగును విజయవంతంగా ప్రారంభించారు.
‘స్వర్గ ఫలం’గా పేరున్న ఈ అరుదైన పండు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెడుతోంది.
నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో.. విటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గాక్ ఫ్రూట్‌కు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పండు కిలో ధర రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతుండటంతో.. ఇది రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటగా మారింది. థాయ్‌లాండ్, మలేషియా, చైనా, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలకే పరిమితమైన ఈ పంటను తెలంగాణలోనూ సాగు చేస్తూ బుచ్చిరెడ్డి లాభాలు పొందుతున్నారు. దేశీయంగా కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాంతాల నుంచి మెుక్కలు తీసుకువచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు. ఎకరం పొలంలో పంట సాగు ప్రారంభించడానికి సుమారు రూ.9 లక్షలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.
తాను ఎకరంలో 210 మొక్కలు నాటగా.. అవి మంచి దిగుబడి ఇస్తున్నాయని బుచ్చిరెడ్డి వివరించారు. ఈ తీగజాతి పంటలో పోషక విలువలతో కూడిన ఎర్రటి గుజ్జు ప్రధాన భాగమని చెప్పారు. మొక్క నాటిన నాలుగు నుంచి ఐదు నెలల్లో పూత ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇక్కడ కీలకాంశం ఏంటంటే, ఈ పంటకు ఆడ, మగ పువ్వుల మధ్య పరాగ సంపర్కం తప్పనిసరి అని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన మూడు నెలల్లో పిందె తయారై, పండు పూర్తిగా పక్వానికి వస్తుందన్నారు.
మొత్తంగా మొక్క నాటిన ఏడు నెలల్లో పండ్లు విక్రయానికి సిద్ధమవుతాయన్నారు. ఒక్కో చెట్టు 30 నుంచి 60 పండ్ల కాస్తుందని.. పండు దాదాపుగా ఒక కిలో బరువు ఉంటుందన్నారు. ఈ లెక్కన సుమారు ఒక్కో చెట్టు నుంచి రూ.30 వేల వరకు లాభం పొందవచ్చునని అంటున్నారు. ఇలా తక్కువ సాగు భూమిలోనూ అధిక ఆదాయం, స్థానికంగా విదేశీ పండ్ల డిమాండ్‌ను తీర్చే అవకాశం ఉండటంతో బుచ్చిరెడ్డి సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
































