సుడులు తిరుగుతూ.. కాకినాడ తీరం వైపు అతి తీవ్ర తుఫాన్

బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్..


గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకూ అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.

ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ బంగాళాఖాతం మచిలీపట్నానికి 230, కాకినాడకు 310, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ తీరం వైపు కదులుతోంది. ఈ రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్ చేరువ అవుతున్న కొద్దీ మహోగ్రంగా మారుతూ కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తీవ్రత మరో రేపు కూడా కొనసాగనుంది. నేటి నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయి.

కాపులుప్పాడలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 125 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. విశాఖ రూరల్- 120, ఆనందపురం- 117 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 86 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మొత్తం 233 మండలాల పరిధిలోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండబోతోందని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 పునరావాస శిబిరాలు ఏర్పాటయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.