మొంథా తుపాను వేళ కీలక ప్రకటన.. నేటినుండి వారికి నిత్యావసరాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని విధాల చర్యలు చేపట్టింది.


ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులను అలర్ట్ చేసిన ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడు బులిటెన్ లను విడుదల చేస్తూ తగిన చర్యలు చేపడుతోంది.

తుఫాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం, తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలలో ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులను పంపిణీ చేయనుంది. ఇక ఇదే విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

12 జిల్లాలలో అధికారులు అలెర్ట్

ఏలూరు జిల్లాలో తుఫాను ముందస్తు చర్యలను పరిశీలించిన ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తుఫాన్ హెచ్చరికలతో ప్రజలకు సేవలు అందించడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మొంథా తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయని తెలిపిన ఆయన, 12 జిల్లాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

ఉదయం 9 గంటల నుండి రేషన్ దుకాణాల్లో నిత్యవసర సరుకులు

మొంథా తుఫాను ప్రభావం కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ జిల్లాలలో మంగళవారం ఉదయం 9 గంటల నుండి రేషన్ దుకాణాల్లో నిత్యవసర సరుకులు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

పునరావాస కేంద్రాల్లో ఉంటే సహాయం ఇలా

మొత్తం 7 లక్షల మందికి నిత్య అవసరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు సాయం అందిస్తామని, 25 కేజీల బియ్యం, నిత్య అవసరాలు పంపిణీ చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన క్రమంలో రేపటి నుంచి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పౌరసరఫరాల శాఖ అధికారులు తదనుగుణంగా పనిచేస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

12 జిల్లాలలో ప్రజలకు సౌకర్యాలపై దృష్టి

12 జిల్లాలలో 14వేల 145 రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలిగితే అటువంటి చోట్ల జనరేటర్స్ అందుబాటులో ఉంచుతున్నామని, ఆయా జిల్లాలలో పెట్రోల్, డీజిల్ కు కూడా కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి 30 వేల టార్పాలిన్ లను అందుబాటులో ఉంచినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.