మోస్ట్ ఫేవరెట్ కార్.. నయా అవతార్: భారత మార్కెట్ లో రీఎంట్రీ

వాహనదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రెనొ డస్టర్ ఎస్‌యూవీ.. భారత మార్కెట్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. 2026 జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని లాంచ్ చేయనున్నట్లు ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనొ అధికారికంగా ప్రకటించింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత అనేది త్వరలోనే నిర్ధారిస్తామని పేర్కొంది. దీని పునరాగమనం భారత ఎస్యూవీ మార్కెట్‌ను మలుపు తిప్పుతుందని వ్యాఖ్యానించింది.


మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనాలకు తెర తీసిన మోడల్.. డస్టర్. తొలి తరం ఎస్‌యూవీ ఇదే. ఈ కారుకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లకు ఈ కార్ అంటే మరీ ఇష్టం. ఎటువంటి రోడ్లపైన అయినా పరుగులు పెట్టగలదనే నమ్మకం ఉంది దీనిపై.మార్కెట్ లోకి విడుదల అయిన రెండు సంవత్సరాల్లోపే దేశీయ మార్కెట్ లో రెండు లక్షలకు పైగా కార్లు అమ్ముడుపోయాయంటే దీనికి ఉన్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆ తర్వాత మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రం కావడంతో వెనుకంజ వేసింది.. డస్టర్. క్రమంగా తెరమరుగైంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లు ఇప్పుడు హవా నడిపిస్తోన్నాయి. అదే సమయంలో రెనొకే చెందిన ఇతర పోర్ట్‌ఫోలియోలు క్విడ్, క్విడ్-క్లైంబర్, కిగర్, ట్రైబర్ వంటి చిన్న మోడళ్లకు మంచి డిమాండ్ లభించింది. సంస్థ యాజమాన్యం కూడా చాలామటుకు వీటి వరకే పరిమితమైంది. డస్టర్ ఇక మళ్లీ రాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రెనొ.. దీనిపై శుభవార్త వినిపించింది. రెనొ రూపొందించుకున్న ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్ 2027 కింద మొట్టమొదటగా విడుదల అవుతోన్న కారు ఇదే. దీంతోనే బోణీ కొట్టాలని భావిస్తోందా సంస్థ యాజమాన్యం. రెనొ.. రీథింక్..’ అనే ట్యాగ్ లైన్ తో దేశీయ మార్కెట్ లోకి డస్టర్ కారును లాంచ్ చేయబోతోంది.

సరికొత్త డస్టర్ సీఎంఎఫ్- బీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది రెనొ 7-సీటర్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. సుమారు 4,340 మిల్లీ మీటర్ల పొడవును కలిగిఉండొచ్చు. ఇది గత డస్టర్ కంటే కొంత మెరుగు. విశాలమైన ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అధునాతన క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన పూర్తిగా ఆధునీకీకరించిన క్యాబిన్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్, 1.6-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో అందుబాటులోకి రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.