హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్, కేంద్రం కీలక నిర్ణయం

హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65) జాతీయ రహదారి పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ మార్గం హై సెక్యూరిటీ హైవేగా మారనుంది. ప్రమాద రహితంగా తీర్చి దిద్దటంతో పాటుగా..పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించేలా నిర్ణయించారు. ఇక.. ఈ లైన్ ఇప్పటికే ఆరు వరుసలుగా మార్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. ఇక, విజయవాడ.. హైదరాబాద్ మధ్య దూరం భారీగా తగ్గనుంది. తాజా నిర్ణయాలను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్దం అయింది.


హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఇక సురక్షితంగా మార్చేందుకు కేంద్రం నిర్ణయ తీసుకుంది. దారి పొడవునా ఎక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలిసేలా డిజిటల్‌, స్మార్ట్‌ రోడ్డుగా రూపుదిద్దుకోనుంది. సోలార్‌ వీధి దీపాలు, రహ దారి పక్కన భద్రతా బారికేడ్లు, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు, రోడ్డు మధ్యలో మొక్కలతోపాటు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ రోడ్డు త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నాలుగు వరుసలతో ఉన్న ఈ రహదారిని తెలంగాణ పరిధిలోని మల్కాపూర్‌ వద్ద ఉన్న అందోల్‌ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పట్టణంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వరకు 231.32 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా విస్తరించనున్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌-విజయవాడ రోడ్డు విస్తరణ కోసం దాదాపు రూ.10,391.53 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిలో నిర్మాణ వ్యయం రూ.6,775.47 కోట్లు, వివిధ అవసరాలకు మరో రూ.3,616.06 కోట్లు కావాల్సి ఉందని తేల్చారు. ట్రాఫిక్‌ పెరగడం, విజయవాడ వెళ్లేందుకు ఈ రోడ్డే కీలకం కావడంతో దీని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ఆమోదం తెలిపింది. విస్తరణతోపాటు రోడ్డును భద్రతా పరంగానూ పటిష్ఠం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ హైవేను కూడా పూర్తిస్థాయిలో స్మార్ట్‌ రోడ్డుగా మార్చనుంది. రహదారిపై అత్యంత అధునాతనమెన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానిస్తారు. ఈ విధానంలో రహదారిపై 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ప్రతి కిలోమీటర్‌కు (రెండు వైపులా) ఒకటి చొప్పున 231 కెమెరాలను అమర్చుతారు. ఇవి అత్యంత శక్తిమంతంగా ఉండడంతోపాటు 24 గంటలూ రోడ్లపై నిఘా ఉంచుతాయి. ఫలితంగా రహదారి అత్యంత భద్రతగా ఉండడంతోపాటు ప్రమాదాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.