హైదరాబాద్ లో సైలెంట్ గా విస్తరిస్తున్న వ్యాధి.. ప్రతి 14 మందిలో ఒకరికి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్ నెఫ్రాలజిస్టులు ఇండియన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా హైదరాబాద్‌ లో ఈ కొత్త రకం కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నట్లు తేలింది. ఈ వ్యాధి యువతనే అధికంగా టార్గెట్ చేస్తుండటం ఆందోళనకరంగా మారింది.

సాధారణంగా వ్యవసాయరంగంలో పనిచేసేవారిలో పురుగుమందుల ప్రభావం వల్ల వచ్చే CKDu అనే కిడ్నీ సంబంధిత వ్యాధి కనిపిస్తుంటుంది. కానీ ఈ కొత్త రకం CKDu మాత్రం పట్టణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు, సర్వీస్ వర్కర్లు, అలాగే వ్యవసాయరంగంలో లేని వ్యక్తుల్లో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 20 నుండి 40 సంవత్సరాల వయసు గలవారు డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల వ్యాధుల హిస్టరీ లేకుండానే తీవ్రమైన కిడ్నీ వ్యాధితో రావడం ఆశ్చర్యకరమని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

అయితే చాలా మంది ఉపయోగించే ఫెయిర్ నెస్ క్రీముల కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకునేందుకు వాడే హానికారక మెర్క్యూరీ అధికంగా ఉంటుందని.. ఈ రసాయనాన్ని చర్మం గ్రహించడం వల్ల అది శరీరంలోకి చేరి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే ప్రతిరోజూ తగినంత నీరు (2.5-3 లీటర్లు) తాగాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక వైద్యుల సూచన లేకుండా పెయిన్‌ కిల్లర్లు, ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ పౌడర్‌ లను వినియోగించొద్దని వివరిస్తున్నారు. అలాగే గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల (రోజుకు హాఫ్ లీటర్ కంటే ఎక్కువ) కిడ్నీలు ఫెయిల్ అవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.