కేంద్ర ఉద్యోగుల జీతాలు ఎంత పెరగవచ్చు? ఫిట్‌మెంట్ ఫ్యాక్టరే కీలకం

కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను (Terms of Reference – ToR) ఆమోదించింది. దీంతో కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి.


తాజా అంచనాల ప్రకారం, ఈ కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చనుంది.

సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, అంతిమంగా అమలు తేదీని మధ్యంతర నివేదిక సమర్పించిన తర్వాత నిర్ణయిస్తామని, అయితే అది “చాలావరకు జనవరి 1, 2026 అయ్యే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. కాగా, కమిషన్ ఏర్పాటుకు జనవరి 2025లోనే కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

నివేదిక గడువు, కమిషన్ కూర్పు

8వ వేతన సంఘానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహిస్తారు. ఇందులో ఒక పార్ట్‌టైమ్ సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.

  • కూర్పు: చైర్‌పర్సన్ – రంజన ప్రకాశ్ దేశాయ్, ఒక పార్ట్‌టైమ్ సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి.
  • గడువు: కమిషన్ ఏర్పాటు అయిన తేదీ నుండి 18 నెలలలోపు తన నివేదికను సమర్పించాలి.
  • మధ్యంతర నివేదిక: తుది నివేదికతో పాటు, ఇది ప్రభుత్వా నికి ఒక మధ్యంతర నివేదికను కూడా అందజేస్తుంది.

జీతాల పెరుగుదల అంచనాలు: ఎంత పెరగవచ్చు?

కొత్త వేతన నిర్మాణంలో జీతాలు, పెన్షన్లు ఎంత లెక్కిస్తారో నిర్ణయించేది ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టరే. 8వ వేతన సంఘంలో అత్యంత చర్చనీయాంశమయ్యేది ఇదే.

7వ వేతన సంఘంలో (2016లో అమలు): అప్పుడు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఉద్యోగులకు 157% పెరుగుదల లభించింది.

కనీస మూల వేతనం (Minimum Basic Pay) ₹7,000 నుంచి ₹18,000కి పెరిగింది.

ఒకవేళ అదే 2.57 ఫ్యాక్టర్‌ను తిరిగి ఇప్పుడు వర్తింపజేస్తే:

కనీస వేతనం ₹18,000 నుంచి ఏకంగా ₹46,260కి పెరగవచ్చు.

కనీస పెన్షన్ ₹9,000 నుంచి ₹23,130కి పెరగవచ్చు.

అయితే, ఈ పెరుగుదల వాస్తవానికి చాలా ఎక్కువ అవుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92కి దగ్గరగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అప్పుడు కనీస మూల వేతనం ₹34,560కి చేరుకుంటుందని అంచనా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.