డిఏ బకాయిలు చెల్లించేదెవరు?

డిఏ బకాయిలు ఉద్యోగి రిటైర్మెంట్‌ నాటి పాలకుడు చెల్లిస్తే ఈ ప్రభుత్వం చెల్లించినట్లా? ప్రభుత్వాలకు ఇప్పుడు లేని ఆదాయం అప్పుడు వస్తుందా? పెరుగుతుందా?


ఇప్పుడు చెల్లింపులు భారమైతే అన్ని బకాయిలు కలిపి అప్పటి ప్రభుత్వాలకు భారం కాదా? ఈ పోస్టు డేటెట్‌ చెక్కులు, వీలునామాలకు విలువ, గ్యారంటీ ఉంటుందా?

జనవరి 2024 డిఏకు సంబంధించి ఈ అక్టోబరు 20న ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 60, 61 విషయమై ఉద్యోగులు, పెన్షనర్ల నుండి అనేక అసంతృప్తులు, ప్రశ్నలు వస్తున్నాయి. నాలుగు డిఏలు బకాయిలు పడి, ఒక్క డిఏ (జనవరి 2024) ప్రకటించి…అక్టోబరు 2025 నాటికి వెనకటి 21 నెలల బకాయిలను ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత, ఇప్పటికే రిటైర్‌ అయినవారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాలతో చెల్లిస్తామని చెప్పడం…ఉద్యమాల ఒత్తిడి ద్వారా ఒక్క డిఏ అయినా సాధించుకున్నామనే ఆనందం ఉత్తర్వులు చూశాక, మోసం తెలిశాక ఆనందం ఆవిరైపోయింది. ఒక్క డిఏ లోనే ఇన్ని మెలికలు ఉంటే భవిష్యత్‌ డిఏలు, పిఆర్‌సిల పట్ల ఉద్యోగులలో మరింత భయం, ఆందోళన పెరిగింది.

గత ప్రభుత్వం 2018 జులై 1 నుండి 2022 జనవరి 1 వరకు బకాయి పడిన 8 డిఏలలో (మూడు డిఏలు కరోనాలో మాఫీ చేసి) పిఆర్‌సి అమలు సందర్భంగా ఐదు డిఏల ఆర్థిక లాభం పిఆర్‌సి పెరుగుదలగా చూపించింది. అప్పటి నుండి పాలకుల రాజకీయ అవసరాలను బట్టి ఏ డిఏ ఎప్పుడు ప్రకటిస్తారో? ఎప్పటినుండి చెల్లిస్తారో, ఎన్ని వాయిదాలలో చెల్లిస్తారో, ఏ డిఏ రావాలో ఎప్పుడు కలుస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. జీవో లలో పేర్కొన్నట్లు కూడా బకాయిలు చెల్లించలేదు. ఒక్కొక్క డిఏ నాలుగు వాయిదాలలో, ఎప్పుడెప్పుడో చెల్లించే ట్రెండ్‌ మొదలైంది.

2024 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం జెఏసి సంఘాల సమావేశంలో 34 వేల కోట్ల రూపాయల పిఆర్‌సి అరియర్లు, డిఏ అరియర్లు, సరెండర్‌ లీవులు, పి.ఎఫ్‌, ఉద్యోగ విరమణ, జిఐఎస్‌, మెడికల్‌ తదితర బకాయిలు ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి పడినట్లు లెక్కలు చెప్పింది. ఎన్నికల ముందు కొన్ని బకాయిలు చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లింపు రాబోయే ప్రభుత్వాలపై నెట్టివేసింది.
ప్రస్తుత ప్రభుత్వం 2024 జనవరి నుండి 2025 జులై వరకు చెల్లించాల్సిన నాలుగు డిఏలకు గాను, పిఆర్‌సి ఇతర సమస్యలకు సంబంధించి మంత్రుల కమిటీ వేసి జెఏసి సంఘాలతో చర్చించి ముఖ్యమంత్రి సమక్షంలో డిఏ ప్రకటన చేసింది. ఉద్యోగుల ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని మనసులో ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమంటూ లెక్కలు చెప్పి ముఖ్యమంత్రి దీపావళి కానుకగా ఒక్క డిఏ ప్రకటించారు. ‘కానుక’ అనేది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల సంప్రదాయ భాషగా మారిపోయింది.
ధరల పెరుగుదల సూచీకి అనుగుణంగా రావాల్సిన డిఏ పాలకపక్ష మీడియాల్లో ‘బోనాంజా’గా ప్రచారమవుతున్నది. ‘కానుక’ అనేది ఇచ్చేవారి ఇష్టాయిష్టాలు, అభిమానాలపై ఆధారపడి ఉంటుంది. ఇంత ఇవ్వాలనే నియమ నిబంధనలు ఉండవు. కాని డిఏకు సంబంధించి ప్రతి 6 నెలలకు చెల్లించాలనే నిబంధన ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి డిఏ నిబంధనలు వదిలేసి తన ఇష్టప్రకారంగా డిఏ కానుకగా ప్రకటించారు.

అయితే డిఏ ప్రకటనలో ప్రభుత్వ మాయ ఉత్తర్వులు వస్తేగాని అర్ధంకాలేదు. ప్రభుత్వం సంఘాలతోగాని, మీడియా ప్రకటన చేసినప్పుడుగాని ఈ విషయం గోప్యంగా ఉంచింది. గత ప్రభుత్వం ఒక డిఏ ఆర్థిక బకాయిల చెల్లింపునకు ఒక ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి రెండేళ్ళ తర్వాత 2027-28లో 12 భాగాలుగా చెల్లిస్తామని, ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాతనే చెల్లిస్తామని మరింత మోసపూరిత ఉత్తర్వులు ఇచ్చింది.
పిఆర్‌సి అయినా, డిఏలు అయినా ధరల సూచీని బట్టి రాబట్టే పోరాటాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం డిఏ చెల్లింపులో బకాయిలను ఉద్యోగ విరమణ తరువాత చెల్లిస్తామనే ప్రమాదకరమైన ట్రెండ్‌ను రాష్ట్ర జెఏసిలు ప్రతిఘటించాలి. డిఏ ఉత్తర్వుల సవరణకై పట్టుపట్టాలి. ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.