ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో అకౌంట్‌లో డబ్బు అయిపోయినప్పుడు క్రెడిట్ కార్డుతో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేయొచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి అన్ని యాప్స్ లో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అయితే వీటిలో కొన్ని యాప్‌లు కేవలం రూపే క్రెడిట్ కార్డుని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంటే మరికొన్ని యాప్స్ వీసా, మాస్టర్ కార్డ్ వంటి క్రెడిట్ కార్డులను కూడా సపోర్ట్ చేస్తున్నాయి.
ప్రాసెస్ ఇలా..
క్రెడిట్ కార్డుని యూపీఐ యాప్ తో లింక్ చేయడం కోసం ముందుగా యూపీఐ యాప్ లోకి వెళ్లి అక్కడ పేమెంట్ ఆప్షన్‌లో ‘యాడ్ క్రెడిట్ కార్డ్’ ఎంచుకోవాలి. ఆ తర్వాత కార్డ్ వివరాలు ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డు యూపీఐ యాప్ తో లింక్ అవుతుంది. ఇకనుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు ఆప్షన్ కూడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ చేస్తే క్రిడిట్ కార్డు నుంచి పేమెంట్ అవుతుంది. ఇలాంటి పేమెంట్స్ కు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
క్రెడ్ యూపీఐ
ఇకపోతే క్రెడ్ యాప్ ద్వారా కూడా యూపీఐ, క్యూఆర్ కోడ్ స్కాన్ పేమెంట్స్ చేయొచ్చు. క్రెడ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని అందులో మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులను లింక్ చేసుకోవాలి. ఎప్పుడైనా యూపీఐ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా క్రెడ్ యాప్ లో క్యూఆర్ స్కానర్ ఓపెన్ చేసి, కింద క్రెడిట్ కార్డు సెలక్ట్ చేసుకుని డైరెక్ట్ గా పేమెంట్ చేయొచ్చు. అన్ని పెద్ద బ్యాంకుల క్రెడిట్ కార్డులు యూపీఐ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం ద్వారా కొన్నిసార్లు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి లాభాలు కూడా పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్ కేవలం మర్చెంట్ చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి. అంటే షాపులు, రెస్టారెంట్ల వంటివి. ఇతర వ్యక్తులకు డబ్బు పంపడం లేదా బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు.
































