భారత్‌లో దారుణంగా పడిపోయిన సాఫ్ట్‌వేర్ల జీతాలు.. అమెరికాలో మాత్రం భారీగా పెరిగాయి

ప్రపంచ టెక్ రంగం ప్రస్తుతం విపరీతమైన మార్పులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా భారతదేశంలోని టెక్ నిపుణులు భారీ వేతన తగ్గుదలతో సతమతమవుతుండగా, అమెరికాలోని వారి సహచరులు మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేతన వృద్ధిని చూస్తున్నారు.పేరోల్, కంప్లైయన్స్ ప్లాట్‌ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్‌మెంట్ సంస్థ కార్టా (Carta)సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో ఇంజనీరింగ్, డేటా రంగాల సగటు వార్షిక వేతనాలు 2025లో 40 శాతం పడిపోయి 22 వేల డాలర్లు (సుమారు రూ.


18 లక్షలు) వద్దకు చేరాయి. గత సంవత్సరం ఇది 36 వేల డాలర్లు (రూ. 30 లక్షలు)గా ఉంది.

ఇదే సమయంలో, అమెరికాలో ఇలాంటి టెక్ ఉద్యోగాలకు సగటు Pay 1,22,000 డాలర్ల నుండి 150,000 డాలర్లకి పెరిగింది. అంటే దాదాపు 23 శాతం వృద్ధి నమోదు చేసింది. ఉత్పత్తి, డిజైన్ రంగాల్లో కూడా భారత ఉద్యోగులు చాలా నష్టపోయారు. అమెరికాలో ఇలాంటి పాత్రలకు సగటు జీతం 138,000 డాలర్లు కాగా, భారతదేశంలో అది కేవలం 23 వేల డాలర్లకు పడిపోయింది.

ప్రపంచ టెక్ రంగం ఇంకా లింగ వేతన అసమానతలతో పోరాడుతుండగా, భారతదేశం మాత్రం కొంత సమతుల్య చిత్రాన్ని చూపుతోంది. నివేదిక ప్రకారం భారత టెక్ రంగం లింగ సమానత్వంలో ప్రగతిశీలంగా ఉంది. ముఖ్యంగా అమ్మకాల (sales) విభాగంలో ఉన్న ఉద్యోగుల్లో పూర్తి సమానత్వం కనిపించింది. సేల్స్ విభాగంలో పురుషులు, మహిళలు ఇద్దరూ సగటుగా 12,000 డాలర్లు సంపాదిస్తున్నారు. అయితే ఇతర రంగాల్లో తేడాలు కొనసాగుతున్నాయి.

ప్రొడక్ట్ & డిజైన్ పాత్రల్లో పురుషులు 23 వేల డాలర్లు సంపాదిస్తుండగా.. మహిళలు 18 వేల డాలర్లు సంపాదిస్తున్నారు. ఇక డేటా పాత్రల్లో పురుషులు 18 వేల డాలర్లు సంపాదిస్తుండగా.. మహిళలు 13 వేల డాలర్లు సంపాదిస్తున్నారు. కెనడా, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో లింగ వేతన తేడాలు మరింతగా ఉన్నాయని నివేదిక తెలిపింది.

డీల్, కార్టా కలిపి 150కి పైగా దేశాల్లో 35 వేల కంపెనీలకు పైగా సేవలు అందిస్తున్నాయి. ఈ విశ్లేషణ 9 లక్షలకు పైగా వేతన, ఈక్విటీ డేటా పాయింట్ల ఆధారంగా రూపొందించబడింది. నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి టెక్ ప్రతిభకు ఎక్కువ వేతనం ఇప్పుడు ఈక్విటీ (company ownership రూపంలోనే వస్తోంది. 2021 నుండి 2025 మధ్య కాలంలో ఇంజనీర్లకు ఇచ్చే ఈక్విటీ గ్రాంట్లు నిరంతరం పెరుగుతున్నాయి.

భారతదేశం, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగంగా ఈ మార్పుకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. కంపెనీలు ఇప్పుడు జీతం + ఈక్విటీ అనే మిశ్రమ మోడల్‌ వైపు కదులుతున్నాయి, ఇది ఉద్యోగులకు భవిష్యత్తులో కంపెనీ వృద్ధిపై ఆధారపడి పెద్ద లాభాలను అందించే అవకాశం కల్పిస్తుంది.

ఏదేమైనా భారతదేశం వంటి మార్కెట్లలో సాంప్రదాయ వేతన నిర్మాణాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. AI ఆధారిత ఆటోమేషన్, గ్లోబల్ రిక్రూట్‌మెంట్ మరియు ఖర్చు తగ్గింపు చర్యలు ఈ దిశలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇకపై కంపెనీలు కేవలం వేతనం కాకుండా ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు ద్వారా ప్రతిభను నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ నివేదిక ప్రపంచ టెక్ మార్కెట్‌లో ఏర్పడుతున్న వేతన అసమానతలు, ఈక్విటీ ఆధారిత పరిహారం పెరుగుదల, భారతీయ టెక్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.